logo

నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం

జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.

Updated : 23 Apr 2024 05:21 IST

లీటరు నీటిలో ఉండాల్సిన మినరల్స్‌ మిల్లీ గ్రాముల్లో ఇలా..: నైట్రేట్‌ 45, ఐరన్‌ 0.3, సల్ఫేట్‌ 200,  సీఏ సీవోటు 200, డిసాల్వ్‌డ్‌ సాలిడ్లు 500, క్యాల్షియం 75,  క్లోరైడ్‌ 250,  ఫ్లోరైడ్‌ 1.0.


న్యూస్‌టుడే, తాండూరు, పరిగి: 

జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. అధికారులు తనిఖీలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఇష్టానుసారంగా శుద్ధి చేస్తున్నారు

ప్రస్తుత వేసవిలో చాలా మంది శుద్ధి చేసిన నీటిని తాగడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గ్రామాలే కాకుండా తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి పట్టణాల్లోని ప్లాంట్లలో విక్రయిస్తున్న నీటికి డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న ప్లాంట్ల యజమానులు ఇష్టాను సారంగా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు.

 ఒక్కో లీటరు నీటిలో మినరల్స్‌ ఉండాల్సినవి ఉండటంలేదు. ఇదే నీటిని ప్లాంట్ల వద్ద విక్రయించి ప్రతి 20 లీటర్ల వద్ద రూ.10 నుంచి రూ.15 వసూలు చేస్తున్నారు. ఆటోలో తీసికెళ్లి ఇళ్ల వద్ద విక్రయిస్తే అదే 20 లీటర్ల వద్ద రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి, రెండో అంతస్తులో ఉండే ఇళ్లల్లోకి తీసుకెళ్లాలంటే రూ.25 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా రోజూ వారీగా వేల కొద్ది క్యాన్లలో నింపిన నాణ్యతా ప్రమాణాలు లేని నీటిని విక్రయించి యజమానులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.

ల్యాబ్‌లతో సంబంధం లేకుండానే..

నీటిని విక్రయిస్తున్న ప్లాంట్ల యజమానులు నాణ్యతా ప్రమాణాల పరీక్షకు సంబంధించి ల్యాబ్‌, పరికరాలను ఏర్పాటు చేసుకోవడం విస్మరించారు. భారత ప్రమాణాల సంస్థ నిబంధనల మేరకు ప్లాంట్లలో మైక్రో బయాలజిస్ట్‌, కెమిస్టు ఉండాలి. ప్లాంట్లలో స్టీలు డ్రమ్ములనే వినియోగించాలి. పైపులైన్లు అంతర్గతంగా ఉండాలి. ప్రతి ప్లాంటులో ఏసీ కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం కొన సాగుతున్న అధికశాతం ప్లాంట్లలో ఎక్కడా ఇవి లేవు.

అనుమతుల్లేని ప్లాంటు 500కుపైనే కొనసాగింపు

జిల్లా వ్యాప్తంగా అనధికారిక లెక్కల ప్రకారం 500కు పైగా నీటి శుద్ధి ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఏ ఒక్కటీ నిబంధనలు పాటించడంలేదని అధికారులే వివరిస్తున్నారు. ఇలాంటి ప్లాంటు నుంచి శుభ్రత, నాణ్యత లేకుండా విక్రయించే నీటిని తాగుతున్న ప్రజలు అనుకోకుండా అనారోగ్యాలకు గురైతే బాధ్యులెవరనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

  •  బల్లులు, ఇతర కీటకాలు పాకులాడే చిన్న పాటి గదులు, రేకుల షెడ్లలో యజమానులు ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. భూగర్భం నుంచి నేరుగా తోడిన నీటికి పెద్దగా పరిజ్ఞానం లేకుండానే రసాయ మందులను కలిపి శుద్ధి చేస్తున్నారు. తర్వాత నిర్ణీత ప్రమాణాల మేరకు శుభ్రం చేయని ప్లాస్టిక్‌ ట్యాంకుల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇలాంటి నీటినే తాగుతున్నారు.
  • జిల్లావ్యాప్తంగా కేవలం రెండు ప్లాంట్లకు మాత్రమే అన్నిరకాల అనుమతులు ఉండడం విశేషం. ఇటీవల అనుమతుల్లేని నీటి శుద్ధి ప్లాంట్లను జప్తు చేస్తామని జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారిణి దీపారెడ్డి ప్రకటించినా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు