logo

మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల

డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్‌ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు.

Published : 24 Apr 2024 01:50 IST

మహిళ నుంచి రూ.1.8 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్‌ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో దుబాయ్‌, మలేషియా, సింగపూర్‌, బ్యాంకాక్‌లో విలాస జీవితం గడుపుతాడు. నగరానికి చెందిన ఓ వితంతువు నుంచి రూ.1.8 కోట్లు కొట్టేసిన ఈ కేటుగాడ్ని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 2 ఫోన్లు, కస్టమ్స్‌ అధికారుల పేరుతో నకిలీ రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, సైబర్‌క్రైమ్‌ డీసీపీ కొత్తపల్లి నరసింహ, ఏసీపీ రవీందర్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఏపీ తిరుపతి జిల్లా పాకాల మండలం వలపలవారిపల్లికి చెందిన కామినేని వంశీ చౌదరి అలియాస్‌ కృష్ణవంశీ అలియాస్‌ కన్నయ్య(38) బెంగళూరులో గ్లాస్‌ కట్టింగ్‌ పనిచేశాడు. పక్కనే ఉన్న జాబ్‌ కన్సల్టెన్సీ వారితో పరిచయం పెంచుకుని తేలిగ్గా డబ్బు సంపాదించడంపై దృష్టిపెట్టాడు. కొందరు నిరుద్యోగుల్ని మోసం చేయగా అక్కడి కోరమంగళ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. షాదీ.కామ్‌లో వంశీకృష్ణ పేరుతో రిజిస్టర్‌ చేసుకుని తాను విడాకులు తీసుకున్నానని, అమెరికాలో గూగుల్‌లో పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. ఒంటరి మహిళలతో పరిచయం పెరిగాక పెళ్లి చేసుకుందామనేవాడు. మహిళల బ్యాంకు ఖాతా వివరాలు, బంగారు ఆభరణాలు తీసుకుంటాడు. కస్టమ్స్‌ అధికారులతో తనకు పరిచయాలున్నాయని.. ఎయిర్‌పోర్టుల్లో సీజ్‌ చేసిన బంగారాన్ని తక్కువకు కొందామని మోసాలు చేస్తాడు. అలా కొండాపూర్‌కు చెందిన ఇద్దరు పిల్లలున్న వితంతువు(35)ను సంప్రదించి వివాహం చేసుకుంటానన్నాడు. తన తల్లిదండ్రులకు ఇష్టం లేక బ్యాంకు ఖాతాలు బ్లాక్‌ చేయించారని డబ్బు అవసరమని అసలు మోసానికి తెర లేపాడు. నమ్మిన బాధితురాలు తన బ్యాంకు ఖాతా యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌, బంగారు ఆభరణాలు ఇచ్చింది. మొత్తం రూ.1.8 కోట్లు వసూలు చేసిన వంశీ పత్తాలేకుండా పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని