logo

విశ్రాంత ఐఏఎస్‌కు రూ.1.89 కోట్లకు టోకరా

సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది.

Published : 24 Apr 2024 01:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. దాదాపు 2 నెలలపాటు వేర్వేరు పేర్లతో డబ్బు వసూలు చేసింది. అధికారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఈ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నగరంలో నివాసముంటున్నారు. ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో సామాజిక మాధ్యమాల్లో ఓ సందేశం వచ్చింది. అధికారి ఆమెను ఎవరని ప్రశ్నించగా బెంగళూరులో ఉంటానని, ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఫ్యూచర్‌ గ్లోబల్‌ ద్వారా ట్రేడింగ్‌ చేస్తున్నానని.. ఇందులో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అధికారి నమ్మిన తర్వాత ఆమె టెలిగ్రామ్‌ ద్వారా లింకు పంపించింది. అందులో కస్టమర్‌ సేవను సంప్రదించగా ఓ బ్యాంకు ఖాతా ఇచ్చారు. దీంతో అధికారి ఏప్రిల్‌ మూడోవారంలో ఆ ఖాతాలో రూ.50 వేలు జమ చేశారు. ఆ తర్వాత రూ.5 లక్షలు.. మరోసారి రూ.50 లక్షలు డిపాజిట్‌ చేశారు. కొన్నిరోజుల తర్వాత పెట్టుబడికి లాభం కలిపి రూ.67 లక్షలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించింది. ఫ్యూచర్‌ గ్లోబల్‌ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. మొత్తం 40 విడతల్లో రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. ప్రతిభారావు పేరుతో మహిళ పరిచయం చేసుకుందని, తెలుగు మాట్లాడిందని అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు