logo

ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!

చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్‌ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్‌ దూరంలో బాహ్య వలయ రహదారి..

Published : 24 Apr 2024 02:33 IST

దుండిగల్‌ మున్సిపాలిటీలో మూడెకరాలు స్వాధీనానికి యత్నం

పార్కు స్థలంలో డిజిటల్‌ సర్వే చేస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌, దుండిగల్‌, న్యూస్‌టుడే: చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్‌ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్‌ దూరంలో బాహ్య వలయ రహదారి.. వీటి మధ్యలో ఉద్యానాలకు కేటాయించిన భూములపై రెండేళ్లక్రితం అక్రమార్కుల కన్ను పడింది. రూ.90కోట్ల విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకుంటే పది, పదిహేను అపార్ట్‌మెంట్లు సులువుగా కట్టుకునేందుకు అవకాశాలున్నాయన్న ఆలోచన కలిగింది. ఆ స్థలాలు తమవేనంటూ వారు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కొన్ని నెలల తరువాత.. ఆ రిజిస్ట్రేషన్‌ పత్రాల ఆధారంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానికులు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం ఆ భూముల్లో డిజిటల్‌ సర్వే నిర్వహిస్తున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు.

గ్రామ పంచాయతీ నాటి లే-అవుట్‌..

దుండిగల్‌ గ్రామ పంచాయతీలోని మల్లంపేట పరిధిలో ప్రైవేటు పట్టాభూముల్లో ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తి లే-అవుట్‌ వేశారు. ప్రజాఅవసరాలు, ఉద్యానాల కోసం పది చోట్ల పార్కుల కోసం మూడెకరాల భూమిని గ్రామపంచాయతీకి అప్పగించారు. అప్పటికే ఔటర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మల్లంపేటకు సమీపంలో ఉండడంతో లేఅవుట్‌లో ప్లాట్లు వేగంగా అమ్ముడయ్యాయి. బాహ్య వలయ రహదారి అందుబాటులోకి రావడంతో రియల్‌ వెంచర్ల వ్యాపారులు ఎకరాల చొప్పున కొనుగోలుచేసి హెచ్‌ఎండీఏ అనుమతులతో గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల క్రితం దుండిగల్‌ మున్సిపాలిటీ ఏర్పాటుకావడంతో పంచాయతీకి ఇచ్చిన మూడెకరాలు మున్సిపాలిటీ ఖాతాలోకి వచ్చాయి.వాటిని అధికారులు చూసుకోలేదు.

పక్కాగా సొంతం చేసుకునేందుకు..

విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయంటూ అన్వేషణ చేస్తున్న కొందరు అక్రమార్కులకు గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్‌మెంట్ల మధ్య మూడెకరాల భూములు కనిపించాయి. వాటి వివరాలను రహస్యంగా సేకరించారు. మున్సిపాలిటీ ఇంకా స్వాధీనం చేసుకోకపోవడంతో తమ సొంతం చేసుకునేందుకు ఆ భూముల సర్వే నంబర్లు సేకరించారు. పాత దస్త్రాల సాయంతో ఆ భూములు తమవేనంటూ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని