logo

వర్షపు నీటిని ఒడిసి పడదాం..

వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్‌వాటర్‌ ప్రాజెక్టు’, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్‌ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Updated : 24 Apr 2024 05:48 IST

‘జల యోధులను తయారు చేద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం

రీఛార్జింగ్‌ పిట్‌ల ఏర్పాటుపై ప్లంబర్లకు అవగాహన కల్పిస్తున్న ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్‌వాటర్‌ ప్రాజెక్టు’, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్‌ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసుకునే దుస్థితిని నుంచి బయటపడేందుకు ‘జలయోధులను తయారు చేద్దాం’ అంటూ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలిరోజు 350 మందికి పైగా హాజరయ్యారు. 1000 మందికి శిక్షణ ఇప్పించి వారి ద్వారా మరికొంత మందికి శిక్షణ ఇచ్చి కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉద్యమంలా రీఛార్జింగ్‌ పిట్‌లు ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. జలమండలి, జీహెచ్‌ఎంసీ, ఈపీటీఆర్‌ఐలో ప్లంబర్లకు మూడు గంటల శిక్షణ కార్యక్రమాన్ని  సోమవారం ప్రారంభించారు. ఈనెల 24, 25 తేదీల్లోనూ ఈ శిక్షణ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈపీటీఆర్‌ఐ, జీహెచ్‌ఎంసీ, జలమండలి వెబ్‌సైట్‌లో ఉన్న ‘గూగుల్‌ఫారం’ నింపి శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

నాడు ఇంకింది.. నేడు ఉబుకుతోంది.. ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టినా కొన్నిచోట్ల విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే బోర్‌వెల్‌, సంపులచుట్టూ రీఛార్జింగ్‌ పిట్‌లు ఏర్పాటుచేసి అవసరమైతే ఇంజెక్షన్‌ బోర్‌వెల్‌, డగ్‌వెల్‌, ఇంకుడు గుంతలు, డ్రమ్‌ రీఛార్జ్‌, మాడ్యులర్‌ రెయిన్‌వాటర్‌ హార్వెస్ట్‌ ఏర్పాటుచేస్తే లక్షలాది లీటర్ల నీటిని ఒడిసిపట్టొచ్చని ‘బ్లూ హైదరాబాద్‌’ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో ముషీరాబాద్‌ పద్మశాలికాలనీలో, జీహెచ్‌ఎంసీ కార్యాలయం, పలు గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇలా చేపట్టిన ప్రయోగాలు సఫలమై పుష్కలంగా నీరు లభిస్తోందని తెలిపారు. వాననీటి సంరక్షణతో పద్మశాలి కాలనీలో 26 ఏళ్లుగా నీటి ఎద్దడి రాలేదని, 31 అడుగుల్లోనే నీరు ఉబుకుతోందని కాలనీవాసులు చెబుతున్నారు.

80శాతం అందులోనే.. నగరానికి కావాల్సిన నీటి మొత్తంలో 80 శాతం మిద్దెలు, డాబాలు, పైకప్పు భాగాలపై పడిన వర్షపు నీటి ద్వారా దొరుకుతుంది. కానీ ఆ మేరకు వర్షపు నీటిని సంరక్షించి వాడుకోలేకపోతున్నాం. ఒక్కో అపార్టుమెంట్‌ పైకప్పు భాగాన సుమారు 16.5 లక్షల లీటర్ల వర్షపు నీరు కురుస్తుంది. ఈ మొత్తం నీటిని వినియోగించుకుంటే ట్యాంకర్ల ఖర్చు రూ.2.5 లక్షలు తగ్గించుకోవచ్చు.

ఎలా సేకరించాలి.. ప్లంబర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా సులువుగా, వేగవంతంగా నగరంలో రీఛార్జింగ్‌ పిట్‌లు నిర్మించుకోవచ్చు. కొత్త భవన నిర్మాణాలు, మిద్దెలు, డాబాలు, పైకప్పులు, ఖాళీ స్థలాలు, ఉద్యానవనాలు, మైదానాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీటిని ఇంకేలా చేయడంతో పాటు వరదలను నివారించొచ్చు.  ్య  మిద్దెలు, డాబాలు, పైకప్పులపై పడే వర్షపు నీటిని భూఉపరితల లేదా అంతర్భాగ ట్యాంకుల్లో నింపుకోవచ్చు. ఇది చాలా ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ్య భూములపై లేదా ఖాళీ స్థలాలపై పడే వర్షపు నీటిని చెరువులు, సరస్సులకు మళ్లించడం ద్వారా భారీ నీటి వనరుల్లాగా తయారవుతాయి.


ఇంకుడు గుంతలకు మొబైల్‌ యాప్‌

ఈపీటీఆర్‌ఐ సూచన మేరకు వాన నీటి సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ‘ఓడీకే కనెక్ట్‌’ పేరుతో మొబైల్‌యాప్‌ను రూపొందించామని వాన నీటి సంరక్షణ ప్రాజెక్టు సీఈవో కల్పనా రమేశ్‌ తెలిపారు. పౌరులు, మేస్త్రీలు, ప్లంబర్లు ఆ యాప్‌లో లాగిన్‌అయి, వారు నిర్మించిన ఇంకుడుగుంతల వివరాలను అప్‌లోడ్‌ చేస్తే.. ఉత్తమ నిర్మాణాలకు బహుమతులు అందిస్తామన్నారు. వారికి సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలను కూడా అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని