logo

ఓటేద్దాం.. వేయిద్దాం

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్‌లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

Updated : 24 Apr 2024 05:03 IST

పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులకార్యాచరణ

కళాజాత బృందాల ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్‌లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఓటర్లు మే 13న ఓటు హక్కు వినియోగించుకునేలా కళా బృందాలతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు.శాసనసభ ఎన్నికల్లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైన అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈసారి 75 శాతానికి పైగా  ఓటింగ్‌ నమోద చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ‘ఓటరు అవగాహన..ఎన్నికల ప్రక్రియలో భాగస్వామం (స్వీప్‌)’ పేరుతో కొన్ని రోజుల నుంచి చేవెళ్ల, మల్కాజిగిరి  ఎంపీ స్థానాల పరిధిలో ఓటర్ల చైతన్యం కోసం కళాజాత బృందాలు విభిన్న రీతుల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఈ బృందాలు విభిన్న వేదికలను ఎంచుకుంటున్నాయి. సబర్బన్‌ ప్రాంతాల్లో రహదారులపై, జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాల్లో రైతుబజార్లు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ఓటు వినియోగంపై బృందం సభ్యులు పాటలు, నృత్యాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోకపోతే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉండదని ఈ సందర్భంగా వారు ఓటర్లను చైతన్యపరుస్తున్నారు.


ముందు రోజు వరకు..

ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు, వారికి మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా కళాజాత బృందాల సభ్యులు పోలింగ్‌ ముందు రోజు వరకు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈమేరకు రోజువారీ కార్యక్రమాలను రూపొందించి ప్రచారాన్ని చేపడతారు. ఇందుకోసం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని జీహెచ్‌ఎంసీలో ఉన్న రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు, మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం, సాయంత్రం కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, కాలనీ సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన వేదికలపై ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. పాటలతో పాటు ప్రదర్శనలు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్ల పరిసరాలకు స్థానిక యువకులను ఆహ్వానించి వారితో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని