logo

ప్రజారోగ్యంతో బంతాట

కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే.

Published : 24 Apr 2024 02:48 IST

బల్దియాలో ఆహార భద్రతాధికారుల ఇష్టారాజ్యం
పేరుకు 24 మంది.. పనిచేసేది ఏడుగురే..
దీర్ఘకాలిక సెలవుపెట్టిన నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

ఈనాడు, హైదరాబాద్‌: కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. మిగిలిన వారిలో నలుగురు సెలవు పెట్టి పోటీ పరీక్షల సన్నద్ధతకు వెళ్లిపోయారు. ఓ వైపు ఆహారకల్తీ పెచ్చుమీరుతుండగా..అరికట్టాల్సిన అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

తనిఖీలు లేవు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆహార పదార్థాలను విక్రయించే రకరకాల దుకాణాలు, వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు 50 వేల వరకు ఉన్నాయి. వాటిలో ఏది నాణ్యమైన వస్తువు..? ఏది కాదనే విషయమై నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదే. బల్దియాలో పనిచేస్తున్న 24 మంది ఆహార భద్రతాధికారులు, 30 సర్కిళ్లలో పనిచేసే సహాయ వైద్యాధికారులు ఆయా విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేస్తూ.. ప్రజారోగ్యాన్ని కాపాడాలి. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల ఖాళీలను 90 శాతం భర్తీ చేసినా గ్రేటర్‌లో ఆశించిన ఫలితాలు రావడం లేదు.

నలుగురిపై చర్యలు

కమిషనర్‌, అదనపు కమిషనర్‌, జోనల్‌ కమిషనర్లు, ఉపకమిషనర్ల ఆధ్వర్యంలో పనిచేయాల్సిన ఎఫ్‌ఎస్‌ఓలలో కొందరు నెలకోసారి కూడా జోనల్‌ కమిషనర్లకు తనిఖీలపై వివరణ ఇవ్వడం లేదు. ఈ ఏడాది మార్చి 1న అధికారులు మౌలిక, సౌమ్య, రాకేశ్‌, నిహారిక దీర్ఘకాలిక సెలవు కోరుతూ ఆరోగ్య విభాగంలో లేఖ అందజేశారు. వీరు గ్రూప్‌-1 పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వెళ్లారని, సెలవు మంజూరు చేయలేదని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఇటీవల కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ఆదేశించినా స్పందన లేకపోవడంతో వారిని సస్పెండ్‌ చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్నది ఏడుగురే..

టీఎస్‌పీఎస్సీ ద్వారా 26 మంది ఎఫ్‌ఎస్‌ఓలు నాలుగేళ్ల కిందట జీహెచ్‌ఎంసీలో నియమితులయ్యారు. కోర్టు కేసుల కారణంగా ఇద్దరు ఇప్పటికీ బాధ్యతలు తీసుకోలేదు. ఇటీవల ముగ్గురు బాధ్యతలు తీసుకుని శిక్షణ తీసుకుంటున్నారు. మిగిలిన 21 మందిలో ఒకరు ఉద్యోగానికి రాజీనామా చేయగా, నలుగురు తాజాగా సస్పెండ్‌ అయ్యారు. ఇద్దరు మహిళా అధికారులు ప్రసూతి సెలవులో ఉన్నారు. సీఎం వద్ద విధులకు ఇద్దరిని కేటాయించగా, నలుగురు ఎన్నికల విధులకు వెళ్లారు. ఒకరిని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందానికి కేటాయించడంతో ప్రస్తుతం ఏడుగురు ఎఫ్‌ఎస్‌ఓలే ఉన్నట్లు యంత్రాంగం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు