logo

బలం ఉంది.. భరోసా కొరవడింది

రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్‌ ఉంది.

Published : 24 Apr 2024 02:56 IST

రోడ్డెక్కని భారాస నేతలు
లోక్‌సభ అభ్యర్థులను పట్టించుకోని కొందరు ఎమ్మెల్యేలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్‌ ఉంది. ఈ నేతలు, క్యాడరే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి నగరంలో అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. అదే క్యాడర్‌ లోక్‌సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉండిపోయింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. నియోజకవర్గ స్థాయి నేతలు, బల్దియా కార్పొరేటర్లు, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ముందుకు కదలడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తూతూమంత్రంగా పని చేస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి వలసలకు కట్టడి చేస్తూనే.. శ్రేణులను నడిపించడానికి అగ్ర నాయకత్వం కష్టపడాల్సి వస్తోంది.

మెజారిటీ ఎమ్మెల్యేలున్నా..

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రాజధాని పరిధిలో మాత్రం ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. మొత్తం 29 నియోజకవర్గాలకు 18 మంది భారాస ఎమ్మెల్యేలు గెలవగా.. కాంగ్రెస్‌ మూడింటికే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో పని చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదనే భావన చాలామందిలో ఉంది. నగరంలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అభ్యర్థుల విజయానికి వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం ఆసక్తి చూపడం లేదు.


కార్పొరేటర్లదీ ఇదే తీరు..

భారాసకు 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉండగా.. వీరిలో సుమారు 30 మంది వరకు పార్టీ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కేవలం పదిమంది మాత్రమే తిరుగుతున్నారు. కొందరు కార్పొరేటర్లు పోలింగ్‌ తరువాత లేదా.. అంతకుముందే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల ముగ్గురు సిద్ధం కాగా.. వారి పరిధిలోని ఎమ్మెల్యే ఆపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల తరువాత చూద్దామంటూ ఆపినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని