logo

సమృద్ధి జలం.. సంరక్షణతోనే ఫలం

భౌగోళికంగా మెట్ట ప్రాంతం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. కఠిన శిలలు విస్తరించడంతో వర్షాలకు భూగర్భజలాలు పైకి రావడం, వినియోగిస్తున్నకొద్దీ త్వరగా పడిపోవడం జరుగుతోంది

Published : 02 Feb 2023 06:16 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

భౌగోళికంగా మెట్ట ప్రాంతం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. కఠిన శిలలు విస్తరించడంతో వర్షాలకు భూగర్భజలాలు పైకి రావడం, వినియోగిస్తున్నకొద్దీ త్వరగా పడిపోవడం జరుగుతోంది. అయిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. రాజరాజేశ్వర 27.5, అన్నపూర్ణ 3.5, ఎగువమానేరు జలాశయాలు 2 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయి. వీటితోపాటు 625 చెరువులున్నాయి. మల్కపేట, అదనపు ఎత్తిపోతల పథకం పూర్తయితే నీటి వనరుల సామర్థ్యం మరింత పెరుగుతుంది. జిల్లాలో వ్యవసాయానికి 47,568 బావులు, బోరుబావులపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కారణం సాగునీటి వనరుల కింద కాల్వల వ్యవస్థ సక్రమంగా లేదు. పంటల సాగులో వరి గణనీయంగా పెరిగింది. నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ గతంతో పోల్చితే భూగర్భజలాల వినియోగం భారీగా పెరిగిందని భూగర్భజలశాఖ ఏడీ గంగ నర్సింలు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి వాటి వాడకం ఎలా ఉండాలనే దానిపై ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు.

ఆందోళనకర పరిణామాలు లేవు

మూడేళ్ల క్రితం అధిక వర్షపాతంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్న ఏడాదే పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మార్పు వచ్చింది. జిల్లా సాధారణ వర్షపాతం 915.3 మిల్లీమీటర్లకు 2020-2021లో 46 శాతం, 2021-2022లో 71 శాతం, 2022-2023 (జనవరి)లో 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2016-17లో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 95 వేల ఎకరాలు కాగా అందులో వరి 44,709 ఎకరాలు. 2022 వానాకాలంలో సాగు 2,40,429 ఎకరాలు కాగా అందులో వరి 1,77,370 ఎకరాలు. ప్రస్తుత యాసంగిలో 1,68,763 ఎకరాలకు గాను 1,66,873 ఎకరాల్లో వరి వేసేవారు. మొత్తం సాగులో 98 శాతం వరి ఉంది. నీటి లభ్యత పెరుగుతున్న కొద్దీ సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. కారణం మూడేళ్లలో జిల్లా సగటు భూగర్భ జలమట్టం అన్ని కాలాల్లో 12 మీటర్ల లోపే ఉంటోంది. వీటిలో 70 శాతం లోపు వినియోగిస్తేనే సురక్షితంగా పరిగణిస్తాం. ఆ స్థాయి దాటితే తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఆందోళనకర పరిణామాలు లేవు. అయితే భవిష్యత్తు భూగర్భ జలాలు కలుషితం కాకుండా నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఉంది.

నిరంతర వినియోగం తగ్గించాలి

నవంబరులో జిల్లా సగటున 3.67 మీటర్లు ఉంటే జనవరి నెలాఖరులోగా 6.43 మీటర్లకు చేరాయి. అంటే నెలకు సగటున మీటరు లోతుకు పడిపోతున్నాయి. యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. వచ్చే మూణ్నెళ్లు అవసరం మేరకే వాడుకునే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ప్రస్తుతం భూగర్భ జలాల లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీన్ని వినియోగిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. బోరుబావుల నిరంతర వినియోగం తగ్గించాలి. ఉపరితల కాల్వల ద్వారా నీటిని వినియోగిస్తే మంచిది. అది పంట దిగుబడులకు మేలు చేస్తుంది. అంతే కాకుండా అత్యంత లోతు నుంచి భూగర్భ జలాన్ని తోడేయడం వల్ల భూమి అంతర పొరల్లో అనేక మార్పులు సంభవించి భూమి కుంగిపోవడం, కంపించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. వర్షపు నీరు పూర్తిగా భూమిలోకి ఇంకేలాగా వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేలా రీఛార్జి గుంతలు తవ్వాలి.

ఏటా పెరుగుదల..

జిల్లాలో 2016 మేలో 17.95 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండేవి. 2020 మేలో 11.07 మీటర్లకు చేరాయి. మూడేళ్లుగా జనవరిలో సగటున 5.96 మీటర్లలోనే ఉంటున్నాయి. 2021లో 6.30 మీటర్లు, 2022లో 5.16, 2023లో 6.43 మీటర్లగా ఉంది. ఒకప్పుడు కరవు పీడిత ప్రాంతమైన జిల్లాలో ఈ పరిణామం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. జలాశయాల నిర్మాణం, మానేరు, మూలవాగులపై చెక్‌డ్యాంలతోపాటు ఊట కుంటలు, వివిధ రకాల ఇంకుడు గుంతలను నిర్మించడం వల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం ఏటా గణనీయ పెరుగుదల నమోదవుతూనే ఉంటుంది.

జాతీయస్థాయిలో గుర్తింపు

జిల్లాలో ఒకే సంవత్సరం 6.03 మీటర్ల భూగర్భ జలాలు పైకి రావడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. దీనికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఉపాధి హామీ పథకంలో చెరువులు, కుంటలు పూడికతీత, భూగర్భజలాలు ఇంకేలా కొండల ప్రాంతంలో రీఛార్జి కందకాలు తవ్వకం చేపట్టాలి. వీటన్నింటిని పూర్తిస్థాయిలో వినియోగించడంతోనే సాధ్యమైంది. ఇది భవిష్యత్తు ఐఏఎస్‌లకు ప్రేరణ కలిగించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జల విధానాన్ని ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ ఐఏఎస్‌ శిక్షణలో ఒక పాఠ్యాంశంగా చేర్చడం వల్ల జిల్లా జల విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు