logo

బ్యాంకులో కాదు.. సొంతానికి జమ

మహిళా సంఘాలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని బ్యాంకు లింకేజీ సంఘాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తుండగా..

Published : 28 Mar 2023 05:29 IST

రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్ల నోటీసులు
లబోదిబోమంటున్న మహిళా సంఘాల సభ్యులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

మహిళా సంఘాలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని బ్యాంకు లింకేజీ సంఘాలు, స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తుండగా.. కొందరు సంఘాలను నమ్మించి నెలనెలా వసూలు చేస్తున్న రుణ మొత్తాన్ని సొంతానికి వాడుకోవడం, బ్యాంకర్లు ఆ సంఘాలకు నోటీసులు ఇవ్వడంతో ఆలస్యంగా బయట పడుతున్నాయి.  

కరీంనగర్‌ నగర పాలక సంస్థ, మెప్మా పరిధిలో రెండేళ్ల కిందట బినామీ సంఘాలు ఏర్పాటు చేసుకొని పలు బ్యాంకుల ద్వారా రూ.కోట్లు తీసుకొని ఎగనామం పెట్టగా.. బాధ్యులైన మెప్మా ఒప్పంద ఉద్యోగులను, ఆర్పీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయం మరవకముందే ఓ ఆర్పీ తీరు వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే నగరంలోని పద్మశాలీ వీధిలో వసంతలక్ష్మి స్లమ్‌ సమాఖ్యలో 14 మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాలకు సంబంధించిన రుణాలను ప్రతి నెలా వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా పెత్తనం చేసి ఆ మొత్తాన్ని ఓ ఆర్పీ సొంతానికి వాడుకున్నారు. రుణాన్ని వసూలు చేసి బ్యాంకులలో జమ చేయకపోవడం, ఆఫీసు బేరర్ల(ఓబీ)కు తెలియకుండా పోవడంతో అనుమానాలు వచ్చి ఆరా తీశారు. సంఘాలలో తీసుకున్న రూ.1,90,000, సమాఖ్యలోని రూ.2,96,627 వాడుకున్నట్లు తేలింది. అదేవిధంగా వెంకటేశ్వర సంఘంలోని బ్యాంకు లింకేజీ రూ.2.50 లక్షలు బ్యాంకులో కట్టాల్సి ఉంది. స్త్రీనిధి రూ.3 లక్షలు అప్పుగా అలాగే ఉంచడం, ఆ సంస్థ మేనేజర్‌ తెలుపడంతో సంఘ సభ్యులు ఆందోళన చెందారు. మరో సభ్యురాలు సంఘం నుంచి వైదొలగగా ఆ పేరు మీద రూ.50 వేలు రుణం తీసుకున్నట్లు సంఘ సభ్యులు వివరించారు.

తాఖీదులతో ఆందోళన

సమాఖ్య పరిధిలో తీసుకున్న సంఘాలు బ్యాంకు ద్వారా రుణాలు సక్రమంగా చెల్లించడం లేదని, బకాయి పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఓ బ్యాంకు ఆ సమాఖ్యకు నోటీసులు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆర్పీ నుంచి తీసుకున్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించే విధంగా చూడాలని కోరుతున్నారు. ఇలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇటీవల కొన్ని ఫిర్యాదులు రాగా అధికారుల హెచ్చరికలతో రుణాలు చెల్లిస్తున్నారు.


కమిషనర్‌కు, పీడీకి ఫిర్యాదు

సమాఖ్య, సంఘంలోని సభ్యుల దగ్గర నుంచి ప్రతినెలా బ్యాంకులో చెల్లించాల్సిన రుణాన్ని తీసుకొని బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న ఆర్పీపై వసంతలక్ష్మి సమాఖ్యకు చెందిన 14 సంఘాల సభ్యులు నగరపాలక కమిషనర్‌, మెప్మా పీడీకి ఫిర్యాదు చేశారు. సోమవారం నగర పాలక కార్యాలయానికి వచ్చి అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు కావడంతో బ్యాంకర్లు, స్త్రీ నిధి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మొర పెట్టుకున్నారు. సీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టింపు లేకుండా పోయిందని, ఆర్పీ స్పందించడం లేదని ఆగ్రహించారు. సాయంత్రం వీరంతా ఏం చేయాలనే విషయంపై సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి, మేయర్‌, కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు.


చర్యలు తప్పవు
- రాజేశ్వర్‌, సహాయ కమిషనర్‌, నగర పాలిక

సంఘాల సభ్యుల రుణాలను బ్యాంకులకు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవు. ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. సభ్యులు మొదట్లోనే అధికారుల దృష్టికి తేవాలి. ఆ సమయంలో రాకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని