logo

కొంచెం మోదం.. కొంచెం ఖేదం..

భారతీయ జనతా పార్టీలో మార్పులు, చేర్పులు ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆనందాన్ని.. కొంత ఆవేదనను నింపాయి. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కమలనాథులను కలవరానికి గురి చేయగా..

Updated : 05 Jul 2023 06:27 IST

భాజపాలో మార్పులపై పార్టీ శ్రేణుల అభిప్రాయం
సంజయ్‌ భవితవ్యంపై జిల్లాలో చర్చ
ఈనాడు, కరీంనగర్‌

భారతీయ జనతా పార్టీలో మార్పులు, చేర్పులు ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల్లో ఒకింత ఆనందాన్ని.. కొంత ఆవేదనను నింపాయి. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కమలనాథులను కలవరానికి గురి చేయగా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రాష్ట్ర పార్టీలో కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడం కొంత జోష్‌ నింపింది.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకమైన మార్పులు, చేర్పులు చేపట్టడం అందులో కరీంనగర్‌ జిల్లానే కేంద్ర బిందువు కావడంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌కు త్వరలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి అప్పగిస్తారనే ప్రచారం పార్టీలో జోరుగా వినిపిస్తుండటం ఆయన అనుచరుల్లో కొంత స్థైర్యాన్ని నింపుతోంది. పార్టీని బలోపేతం చేయడంలో సంజయ్‌ కృషికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని వారు భరోసాలో ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలకు తోడుగా సంజయ్‌ సోమవారం దిల్లీకి వెళ్లి అక్కడే ఉండటం.. జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురిని కలవడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మంత్రి పదవి ఖాయమనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


హుజూరాబాద్‌ గెలుపుతో ఊపు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ 2021లో అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ భాజపాలో చేరారు. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనను భూ వివాదం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్‌ చేయడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారు. పార్టీకి కొత్త ఊపు తేవడంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికది కీలక పాత్ర. 2021 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిపై 24 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఈటల సత్తా చాటారు. తరువాత పార్టీలోనూ ఆయనకు సముచిత స్థానం లభించింది. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. తాజాగా భాజపా అధినాయకత్వం ఆయనకు త్వరలో జరిగే ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతల్ని అప్పగించడంతో భాజపా నాయకులు, కార్యకర్తలు హర్షం ప్రకటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే విషయంలో ఆయన తనదైన ముద్రను వేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈటల రాజేందర్‌ కీలకంగా మారుతారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.


మూడేళ్లకుపైగా సేవలు..

2020 మార్చి 11న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇటు ఎంపీగా అటు పార్టీ అధ్యక్షుడిగా సంజయ్‌ తనదైన ముద్రను వేశారు. ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడం వెనుక సంజయ్‌ కృషి ఉందనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం కూడా గుర్తించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు ప్రజాసంగ్రామ యాత్ర పేరిట అయిదు విడతలుగా పాదయాత్రను చేపట్టి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. 116 రోజులపాటు 1461 కి.మీ మేర పాదయాత్రను చేపట్టి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ సరికొత్త కార్యాచరణతో పార్టీని ముందుకు నడిపించారు. పలు కార్యక్రమాల్ని ప్రజల పక్షాన కొనసాగిస్తూ శ్రేణుల్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా 317 జీవోకు వ్యతిరేకంగా ఆందోళన చేసి అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లారు. పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి పదవి అందుకుని.. ఆ పదవి నిర్వహించిన వ్యవహరణ తీరు వరకు ఆయన రాజకీయ ప్రయాణం భిన్నంగానే సాగింది. రెండుసార్లు కార్పొరేటర్‌గా భాజపా తరపున గెలిచిన సంజయ్‌ కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో నిలిచి 90వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచి ఎంపీ అయ్యారు. ఎంపీగా ఎన్నికైన ఏడాది వ్యవధిలోనే భాజపా రాష్ట్ర రథసారథిగా బాధ్యతల్ని తీసుకున్నారు. పార్టీని ముందుకు నడిపించే విషయంలో నిర్వహించిన పలు భారీ బహిరంగ సభల్లో మోదీ, నడ్డా, అమిత్‌షాల కితాబుల్ని అందుకున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని