logo

Peddapalli: ఎంత పని చేశావు నాన్నా!

ఆ చిన్నారికి నాన్నతో కలిసి బైకుపై తిరగడమంటే ఎంతో ఇష్టం.. తాతయ్య, నానమ్మల వద్దకు వెళ్దామని అనేసరికి ఆనందంతో కేరింతలు కొట్టాడు.. అదే తన చివరి ప్రయాణమవుతుందని ఆ పసి మనసుకు తెలియదు..

Updated : 27 Aug 2023 08:41 IST

కుమారుడిని బావిలో తోసి తండ్రి ఆత్మహత్యాయత్నం

దేవాన్ష్‌

పెద్దపల్లి, సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: ఆ చిన్నారికి నాన్నతో కలిసి బైకుపై తిరగడమంటే ఎంతో ఇష్టం.. తాతయ్య, నానమ్మల వద్దకు వెళ్దామని అనేసరికి ఆనందంతో కేరింతలు కొట్టాడు.. అదే తన చివరి ప్రయాణమవుతుందని ఆ పసి మనసుకు తెలియదు.. అల్లారుముద్దుగా చూసే తండ్రే తన ఆయుష్షు తీస్తాడని ఊహించలేదు..

కుటుంబ గొడవలతో మనస్తాపం చెందిన యువకుడు 17 నెలల కొడుకును చంపి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఎలిగేడు మండలం రాములపల్లిలో శనివారం చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి(30)కి భార్య మానస, కొడుకు దేవాన్ష్‌(17 నెలలు) ఉన్నారు. కొన్నేళ్లుగా తిరుపతిరెడ్డికి సోదరుడు రత్నాకర్‌రెడ్డికి మధ్య భూ వివాదం నెలకొంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. భూ సమస్య పరిష్కారం కాకపోగా రత్నాకర్‌రెడ్డి బంధువులు తిరుపతిరెడ్డిని, అతడి కుమారుడిని చంపేస్తామని పలుమార్లు బెదిరించారు. ఈ నేపథ్యంలో తిరుపతిరెడ్డి దాదాపు ఏడాది కాలంగా కుటుంబంతో సుల్తానాబాద్‌లో ఉంటున్నాడు. శుక్రవారం వరలక్ష్మీ పూజ కోసం భార్యా కొడుకుతో కలిసి స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్ష్‌ను తీసుకొని స్వగ్రామానికి వెళ్లాడు. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోసి, వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.

స్వగ్రామం వెళ్లిన భర్త, కొడుకు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో మానస మామ(భర్త తండ్రి) సంజీవరెడ్డికి ఫోన్‌ చేసింది. ఇంటికి రాలేదని చెప్పిన ఆయన పొలం వద్దకు వెళ్లి చూడగా బావి ఒడ్డుపై తిరుపతిరెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉండటం కనిపించింది. మనవడి కోసం గాలిస్తూ అనుమానంతో బావిలో చూడగా నీళ్లపై చెప్పులు తేలి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని నీటిని మోటార్లతో తోడి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతిరెడ్డిని మొదట సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతిరెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రత్నాకర్‌రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావమరిది లక్ష్మణ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


తిరుపతిరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని