logo

భారీ మెజారిటీతో గెలవడం ఖాయం

కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భారాస, కాంగ్రెస్‌ పార్టీల క్యాడర్‌లో ఎక్కువ మంది కార్యకర్తలు భాజపాకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

Published : 12 Apr 2024 02:08 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భారాస, కాంగ్రెస్‌ పార్టీల క్యాడర్‌లో ఎక్కువ మంది కార్యకర్తలు భాజపాకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. గురువారం రాత్రి కరీంనగర్‌లో ఓ వేడుక మందిరంలో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, సమన్వయకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశానికి నరేంద్రమోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష అని వారు భావిస్తున్నారని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే వేల కోట్ల రూపాయాల వ్యయంతో కరీంనగర్‌, జగిత్యాల, కరీంనగర్‌-వరంగల్‌, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట రహదారి పనులకు మోదీ శంకుస్థాపన చేశారన్నారు. ఏడాది క్రితమే ప్రవేశపెట్టిన సేతబంధన్‌ స్కీం పరిధిలోకి కరీంనగర్‌ ఆర్వోబీ నిర్మాణ పనులను తీసుకొచ్చి పూర్తి నిధులను కేంద్రంతోనే మంజూరు చేయించానని చెప్పారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ ఈ మధ్య నియోజకవర్గ అభివృద్ధి అంతా తానే చేసినట్లు చెప్పుకొంటున్నారని నిధులు ఎలా తెచ్చారో? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడున్న కాంగ్రెస్‌ నేతకు మంత్రి పదవి రాగానే ఎగిసి పడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌ పార్లమెంటులో భాజపా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఓటింగ్‌ శాతం తగ్గుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, భారాస, కాంగ్రెస్‌లో మెజార్టీ క్యాడర్‌ ఈ సారి మోదీ సర్కార్‌ రావాలని కోరుకుంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని