logo

మండుటెండల్లో శ్రమజీవులకు ఊరట

మండుటెండలో శ్రమిస్తున్న ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. రెండేళ్లుగా నిలిపివేసిన తాగునీటి వసతి పునరుద్ధరణ బాధ్యతను పంచాయతీలకు కట్టబెట్టింది.

Published : 12 Apr 2024 02:11 IST

ఉపాధి కూలీలకు తాగునీటి వసతి బాధ్యత పంచాయతీలదే
ఉత్తర్వులు జారీ
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

మండుటెండలో శ్రమిస్తున్న ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. రెండేళ్లుగా నిలిపివేసిన తాగునీటి వసతి పునరుద్ధరణ బాధ్యతను పంచాయతీలకు కట్టబెట్టింది. కార్యదర్శుల సమన్వయంతో పనులు పర్యవేక్షించాలని రెండు రోజుల కిందట అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధిహామీ పథకం కూలీలకు గతంలో వేసవి భత్యం, తాగునీటి బిల్లులు చెల్లించేవారు. రెండేళ్ల కిందట వీటిని రద్దు చేయడంతో కూలీలు దాహార్తితో అల్లాడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా పంచాయతీలే నీటి సరఫరా బాధ్యత తీసుకోవాలని ఆదేశించడంతో కూలీలకు కాస్త ఊరట కలిగింది.

రెండేళ్లుగా నిలిపివేత

పల్లెల్లో నైపుణ్యం లేని కూలీలకు ఉపాధిహామీ కడుపు నింపుతోంది. ఏడాదిలో 100 రోజుల పాటు పని లభిస్తుండటంతో పేద కుటుంబాలకు సాంత్వన కలిగిస్తోంది. గతంలో వేసవిలో ఒక్కో కూలీకి రోజుకు రూ.5, మిగిలిన సీజన్లలో రూ.3 చొప్పున తాగునీటి బిల్లులను ఖాతాలో జమ చేసేవారు. పథకంలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్ల కిందట తీసుకొచ్చిన కొత్త విధానంలో తాగునీటి బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. కాగా పనుల ప్రణాళికలోనే తాగునీటి బిల్లులు ప్రతిపాదించాలని గత నెలలో అధికారులు ఆదేశించారు. అప్పటికే పనుల ప్రతిపాదనలు నివేదించడంతో తాగునీటి వసతిపై సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు తాగునీటి వసతిని పంచాయతీలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో కూలీల ఇబ్బందులు తీరనున్నాయి.


ప్రథమ చికిత్స కిట్ల జాడేదీ!

ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దపల్లిలో 1.18 లక్షల జాబ్‌కార్డుల్లో 2.41 లక్షల మంది కూలీలు, జగిత్యాలలో 1.67 లక్షల జాబ్‌కార్డుల్లో 2.73 లక్షల మంది, కరీంనగర్‌లో 1.23 లక్షల జాబ్‌కార్డుల్లో 2.30 లక్షల మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 97 వేల జాబ్‌కార్డుల్లో 1.98 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నా పని ప్రదేశాల్లో నీటి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సమకూర్చడం లేదు. గతంలో కూలీలకు ప్రథమ చికిత్స కిట్లు అందజేసేవారు. వాటిని కూడా నిలిపివేయడంతో ప్రమాదవశాత్తు గాయాలపాలైన కూలీలకు సత్వర చికిత్స అందడం లేదు. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుండగా కార్యదర్శులు వివిధ విధులతో సతమతమవుతున్నారు. ఉపాధిహామీ కూలీలకు తాగునీటి సరఫరా బాధ్యత అదనపు భారం కానుంది.


రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం

 - రవీందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఉపాధిహామీ కూలీలకు తప్పకుండా పంచాయతీలే తాగునీటిని సరఫరా చేయాలి. దీనిపై రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం. పని ప్రదేశాల్లో కూలీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని