logo

పల్లె దవాఖానాలకు మోక్షమెప్పుడో?

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పల్లె దవాఖానాలు నిర్మించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గంభీరావుపేట మండలానికి నాలుగు పల్లె దవాఖానాలు మంజూరు కాగా అందులో రెండింటిని పూర్తి చేశారు.

Published : 12 Apr 2024 02:13 IST

న్యూస్‌టుడే, గంభీరావుపేట

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పల్లె దవాఖానాలు నిర్మించడం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గంభీరావుపేట మండలానికి నాలుగు పల్లె దవాఖానాలు మంజూరు కాగా అందులో రెండింటిని పూర్తి చేశారు. మిగతా రెండు చోట్ల పనులు ప్రారంభం కాలేదు. పూర్తి చేసిన వాటిని కూడా ఏడాదిగా ప్రారంభించడం లేదు. దీంతో గ్రామీణులకు వైద్య సేవలు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది.

గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేట, ముస్తఫనగర్‌, లింగన్నపేట గ్రామాల్లో పల్లె దవాఖానాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేటలో వీటికి భవనాలు నిర్మించారు. ఇందులో గంభీరావుపేట పల్లె దవాఖానాను సర్పంచులు పదవీ కాలంలో ఉన్న సమయంలోనే గంభీరావుపేట మేజర్‌ పంచాయతీ సర్పంచి కటకం శ్రీధర్‌ పంతులు చేతుల మీదుగా ప్రారంభించారు. దమ్మన్నపేటలో ఇప్పటి వరకు ప్రారంభించలేదు. నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం దాటిపోతున్నప్పటికీ ప్రారంభించకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముస్తఫనగర్‌, లింగన్నపేట గ్రామాల్లో నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదు. పూర్తి చేసినవి ప్రారంభించక, మిగతా చోట్ల పనులు చేపట్టక ప్రజలకు అందుబాటులోకి రాలేదు.  అధికారులు మిగతా రెండు పల్లె దవాఖాల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తయిన వాటిని ఎన్నికల కోడ్‌ ముగిసిన తరవాత అయినా ప్రారంభించి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఉపయోగంలోకి తీసుకురావాలి

 - కర్ణల నరేశ్‌, గంభీరావుపేట

గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మించిన పల్లె దవాఖానాను వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. విద్య, వైద్యం పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. నిర్మించి నిరుపయోగంగా ఉంచడం వల్ల ఉపయోగం లేదు. గంభీరావుపేటలో అద్దె భవనాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే దవాఖానాను ఉపయోగంలోకి తీసుకురావాలి. 


త్వరలోనే వైద్య సేవలు

- వేణుగోపాల్‌రెడ్డి, లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యాధికారి

దమ్మన్నపేట, గంభీరావుపేటలో నిర్మించిన పల్లె దవాఖానాల భవనాలను గుత్తేదారు ఇప్పటి వరకు మాకు అప్పగించలేదు. గంభీరావుపేటలో ప్రారంభించినప్పటికీ దానిని కూడా అప్పగించలేదు. పంచాయతీరాజ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రెండు గ్రామాల్లో వైద్య సేవలు అందేవిధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని