logo

చెక్‌డ్యాంల ఆకృతిలో మార్పులు

జిల్లాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించే లక్ష్యంతో చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడేళ్లుగా అసంపూర్తి పనులతో ప్రహసనంగా మారాయి.

Published : 12 Apr 2024 02:16 IST

అధికారుల నిర్ణయం
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

జిల్లాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించే లక్ష్యంతో చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడేళ్లుగా అసంపూర్తి పనులతో ప్రహసనంగా మారాయి. 2020లో మానేరుపై 11, మూలవాగుపై 13 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ. 140.26 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో మానేరుపై నాలుగు, మూలవాగుపై నాలుగు చెక్‌డ్యాంలు మాత్రమే వందశాతం పూర్తయ్యాయి. మిగతా చోట్ల 50 నుంచి 80 శాతం పనులు జరిగాయి. ఇవి మొత్తం పూర్తయితే జిల్లాలో సుమారు 40 గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు ఏడాది పొడవునా నిలకడగా ఉండే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగని పరిస్థితి. చెక్‌డ్యాంల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, పలుచోట్ల వరదలకు కొట్టుకుపోయి కోతకు గురైన తీరుపై ఇటీవల కలెక్టర్‌ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో అధ్యయనం చేయించి నివేదిక తెప్పించారు. వాటి ఆధారంగా చెక్‌డ్యాంల ఆకృతిలో మార్పులు చేయాలని నిర్ణయించారు.

నిర్మాణ లోపాలే శాపాలు

రెండు వాగులు 120 నుంచి 230 మీటర్ల వెడల్పులతో ఉన్నాయి. వీటిపై నిర్మించే చెక్‌డ్యాంలన్నీ ఒకే ఆకృతితో నిర్మిస్తున్నారు. దీనికితోడు నిర్మాణం చేసే ప్రదేశం ఎంపిక, అక్కడి మట్టి నమూనాల సేకరణ, వరద ప్రవాహ వేగాన్ని అంచనా వంటివేవీ చేయలేదు. 2020కి ముందు నాలుగేళ్లు రెండు వాగుల్లోనూ భారీ వరదలు రాకపోవడమే ఇందుకు కారణం. తర్వాత వరుసగా మూడేళ్లు వరదల ఉద్ధృతికి నిర్మాణ దశలోనే చాలా వరకు కొట్టుకుపోయాయి. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌, ఎల్లారెడ్డిపేట మండలం పదిరి, కోనరావుపేట మండలం మామిడిపల్లి, వేములవాడ మండలం జయవరంలో నీటి ప్రవాహానికి కోతకు గురికావడంతో డిటోనేటర్లు పెట్టి పేల్చేశారు. పనులు జరిగిన చోట గైడ్‌వాల్స్‌ కోతకు గురికావడం, సిమెంటు బెడ్స్‌ కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల పగుళ్లు బారాయి.

ప్రతిపాదనల్లో మార్పు

ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత తొమ్మిది నెలలు వర్షాలు, వరదలతో వాగులో నీటి ఊటలు పెరగడంతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది. మొదటి నుంచి నాణ్యత, పర్యవేక్షణ లోపాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. వైఫల్యాలు బయట పడినచోట కనీస చర్యలు లేకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. చెక్‌డ్యాంల వద్ద పొలాలు వరదలకు కోతకు గురై రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం చెక్‌డ్యాంలకు ఇరువైపులా సిమెంటు వాల్స్‌ నిర్మించాలని సూచించారు. వీటికి రక్షణగా మట్టితో నింపి బండలతో రివిట్‌మెంటు చేయాలి. వరద ప్రవాహం ఉన్న చోట బెడ్‌ ఎత్తు నిర్ణయించాలి. దీనికి స్థానికంగా లభించే మట్టి కాకుండా ఎర్రమట్టిని వాడాలి. ఇలా ఒక్కో చెక్‌డ్యాంపైన అంచనాలు పెరిగే అవకాశం ఉంది. తొలి విడతనే 24 చెక్‌డ్యాంలకు అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. రెండో విడత 100 మీటర్ల వెడల్పుతో ఉన్న చిన్న వాగులకు 14 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. నిర్మాణాలు చేపడుతున్న వాటిలో ఒక్కొక్కటి రూ. 1.5 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 7 కోట్ల వరకు కేటాయించారు.


అనుమతులొచ్చాక పనులు

- శ్రీనివాస్‌, డీఈ

అసంపూర్తి దశలో ఉన్న చెక్‌డ్యాంల్లో లోపాలను గుర్తించి అవసరమైన పనులకు తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక్కో నిర్మాణంపై 10 నుంచి 15 శాతం వ్యయం పెరిగే అవకాశం ఉంది. వీటిని ఉన్నతాధికారులకు పంపించి అనుమతులు మంజూరయ్యాక పనులు ప్రారంభిస్తాం. అగ్రిమెంటు చేసుకున్న దాని ప్రకారం మొత్తం పనులు చేయాల్సిన బాధ్యత గుత్తేదారుపైనే ఉంటుంది. ఇప్పటికే చాలా వాటికి గడువు పొడిగిస్తూ వచ్చాం. జూన్‌ 30లోగా అన్ని చెక్‌డ్యాంలు పూర్తి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని