logo

ప్రత్యేక ప్రణాళికలు.. తాగునీటి సరఫరా

ఎండల తీవ్రతతో పాటు ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో నగరపాలక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అన్నారు.

Published : 12 Apr 2024 02:19 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ఎండల తీవ్రతతో పాటు ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో నగరపాలక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాల పెంపు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నగరపాలిక పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలను వివరించారు.

ప్రశ్న: నగరంలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యలు?

సమాధానం: రామగుండం నగరపాలిక ప్రాంతంలో నీటి సరఫరాకు ప్రధాన ఆధారం ఎల్లంపల్లి జలాశయమే. వేసవి తీవ్రతతో పాటు వివిధ కారణాలతో ఎల్లంపల్లిలో నీటి మట్టం తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. నగరపాలికకు చెందిన రెండు ట్యాంకర్లతో అవసరమైన కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నాం. మరో అయిదు ట్యాంకర్లను అద్దెకు తీసుకోనున్నాం. పరిసరాల్లోని వ్యవసాయ బావులను అద్దెకు తీసుకొని అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం. ట్యాంకర్లలో నీరు నింపేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎన్టీపీసీ, సింగరేణి అధికారులకు లేఖలు రాశాం. గోదావరి ఒడ్డున గల నగరపాలక హెడ్‌ వర్క్సు వద్ద ట్యాంకర్లలో నీటిని నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నీటిని ఉద్యానవనాలు, రహదారి పక్కనున్న మొక్కలకు వినియోగిస్తాం.

ప్ర: ప్రజల నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుతున్నారు?

స: ప్రజలు ఎండవేళలో బయటకు రాకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. నగరంలోని తమ నివాసాల్లో బోరుబావి పక్కన ఇంకుండు గుంతలు నిర్మించుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్‌ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలి. చెత్తను రోడ్లు, మురుగు కాలువల్లో వేస్తే జరిమానాలు విధిస్తాం. నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించకూడదు.  

ప్ర: నీటితొట్ల ఏర్పాటునకు ఎలాంటి ప్రణాళికలు చేపడుతున్నారు?

స: వేసవి తీవ్రత పెరుగుతున్నందున పశుపక్షాదుల దాహార్తి తీర్చేలా నీటితొట్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తాం. వివిధ కాలనీల్లో స్థానికుల సహకారంతో నిర్వహణ చేపడతాం. ప్రతిరోజు తొట్లలో నీరు నింపేలా చర్యలు తీసుకుంటాం. మూగజీవాల దాహార్తి తీర్చడం కోసం మానవతా దృక్పథంతో ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలి.

ప్ర: నగరంలో లీకేజీల నివారణ, బోరుబావుల మరమ్మతులు ఏమేరకు వచ్చాయి.?

స: నగరంలో పలు చోట్ల గుర్తించిన పైపులైన్ల లీకేజీకి యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నాం. లీకేజీల నివారణ కోసం ప్రత్యేకంగా టెండరు నిర్వహించి గుత్తేదారుకు పనులు అప్పగిస్తాం. బోరుబావుల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ.10 లక్షలతో విడిభాగాలు తెప్పించాం. ఫిర్యాదుల ఆధారంగా ఆయా కాలనీల్లోని బోరుబావులకు మరమ్మతులు చేయిస్తున్నాం. కొన్ని బోరుబావుల్లో నీరు అడుగునకు పోవడంతో అదనంగా పైపులు వేయిస్తున్నాం. లీకేజీలను అరికట్టడం, బోరుబావుల మరమ్మతు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నగరపాలక కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం.

ప్ర: ఇంకుడు గుంతల ఏర్పాటునకు కార్యాచరణ?

స: ఇటీవలి కాలంలో రామగుండం నగరపాలికలో 115 భవనాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చాం. వారంతా తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే వారందరికీ నోటీసులు జారీ చేస్తూ వెంటనే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించాం. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నాం. 300 చదరపు మీటర్లకు మించిన వైశాల్యం కలిగిన ప్రతీ ఇంట తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి. నగరపాలక అధికారులు ఇంటింటా తిరుగుతూ సర్వే చేయడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వ స్థలాలను చూపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని