logo

నిరుద్యోగులకు వరం.. పోటీ పరీక్షల సమాచారం

సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా పలు కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Updated : 12 Apr 2024 05:39 IST

న్యూస్‌టుడే, జ్యోతినగర్‌(మార్కండేయకాలనీ)

సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా పలు కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం మళ్లీ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తుండటంతో యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. కొందరు పోటీ పరీక్షల శిక్షణ కోసం మళ్లీ హైదరాబాద్‌ బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పోటీ పరీక్షలపై ఆశలు పెట్టుకుని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

డిజిటల్‌ గ్రంథాలయంతో మేలు...

నిరుద్యోగులు స్థానికంగా ఉన్న గ్రంథాలయాలు ఉపయోగించుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగం ఉండదనేది విద్యావేత్తల భావన. స్థానికంగా కొన్ని రకాల పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తే పోటీ పరీక్షల సిలబస్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే గ్రూపు-1, 2, డీఏవో పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇటీవల ఖరారు చేసింది. వీటితో పాటు యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఖాళీల భర్తీకి పోటీ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించనున్నాయి.

అందుబాటులో 68 లక్షల పుస్తకాలు

పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కొనలేనివారు, శిక్షణ కేంద్రాల్లో ఫీజులు చెల్లించే పరిస్థితులు లేనివారికి అంతర్జాలం ఎంతో తోడ్పాటు  అందిస్తోంది. జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం(ఎన్‌డీఎల్‌) నిరుద్యోగులకు చక్కటి వేదికగా మారింది. ఆన్‌లైన్‌లో పలు పోటీ పరీక్షల సమాచారంతో పాటు ఆయా పరీక్షలకు ఉపయోగపడే సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలు ఎన్‌డీఎల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు పోటీ పరీక్షలకు ఉపయోగపడే 68 లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. ‘జాతీయ విద్యా శిక్షణ పరిశోధన’ సంస్థ(ఎన్‌సీఈఆర్టీ) రూపొందించిన పలు పాఠ్యంశాలకు సంబంధించిన పుస్తకాలు, దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు రూపొందించిన పరిశోధన వ్యాసాలు సైతం ఎన్‌డీఎల్‌లో ఉన్నాయి. విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ఆరు విభాగాలు ఇందులో ఉన్నాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్‌ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.


సద్వినియోగం చేసుకొనే వెసులుబాటు

-ఏ.వీ.ఎన్‌.రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి

డిజిటల్‌ సమాచారం ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ప్రతి అభ్యర్థి తమ ఆలోచన విధానాన్ని బట్టి తమకు కావాల్సిన పాఠ్యాంశాన్ని సద్వినియోగం చేసుకునే వెసులుబాటు ఉంటోంది. డిజిటల్‌ గ్రంథాలయంలో అరుదైన గ్రంథాలు, భౌతికంగా నిల్వ ఉంచిన పేపర్లు, పాత పత్రికలు, తాళపత్ర గ్రంథాల్లోని ప్రతి పేజీని స్కాన్‌ చేసి సాఫ్ట్‌కాపీలుగా అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి వీటిని చదివిందుకు, వినేందుకు ఆడియో, వీడియో సౌకర్యం సైతం ఉంది. యువత దీనిని వినియోగించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని