logo

రాజస్థాన్‌ నుంచి వచ్చి హుజూరాబాద్‌లో చోరీ

హుజూరాబాద్‌ కోర్టు భవనం ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో గత నెల 18న చోరీ కేసులో హరియాణ రాష్ట్రం నూహు జిల్లా గొడెలాకు చెందిన ముషారఫ్‌ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌జీ తెలిపారు.

Published : 12 Apr 2024 02:27 IST

ఏటీఎం ధ్వంసం కేసులో ముఠా సభ్యుడి అరెస్టు 
రూ.60 వేల నగదు, లారీ కంటైనర్‌ స్వాధీనం

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ కోర్టు భవనం ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో గత నెల 18న చోరీ కేసులో హరియాణ రాష్ట్రం నూహు జిల్లా గొడెలాకు చెందిన ముషారఫ్‌ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌జీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.60 వేల నగదు, ఓ కంటైనర్‌ లారీని స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. గురువారం హుజూరాబాద్‌ ఠాణాలో ఏసీపీ, సీఐ రమేశ్‌ నిందితుడి అరెస్టు చూపుతూ కేసు వివరాలు వెల్లడించారు. ముషారఫ్‌తో పాటు అతడి అన్న సపత్‌, స్నేహితులైన దిల్లీకి చెందిన అప్తాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఉటావడ్‌కు చెందిన సాజిద్‌, హరియాణ రాష్ట్రం సలాహేదీకి చెందిన ఫరీద్‌ కలిసి రాజస్థాన్‌కు చెందిన ఓ లారీ కంటైనర్‌ యజమాని దగ్గర పని చేస్తున్నారు. వీరు లారీ లోడ్‌తో ముందుగా విజయవాడ చేరుకొన్నారు. అక్కడి నుంచి వరంగల్‌ మీదుగా గత నెల 17 రాత్రి హుజూరాబాద్‌కు వచ్చారు. ఈ అయిదుగురు పట్టణ శివారులోని ఓ హోటల్‌ భోజనం చేసి ఓ ఇంటిముందు నిలిపిన ద్విచక్రవాహనం, కారును దొంగిలించారు. పట్టణంలో చీకటి ప్రదేశంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద రెక్కీ నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు అప్తాబ్‌ ఏటీఎం ముందు నిల్చొగా మిగిలిన నలుగురు లోపలికి చొరబడి సీసీ కెమెరాలకు నల్లటి రంగు పిచికారీ చేశారు. కట్టర్‌లతో కత్తిరించి రూ.8.64 లక్షల నగదు తీసుకుని పారిపోయారు. దొంగిలించిన ద్విచక్ర వాహనం, కారును మండలంలోని తుమ్మనపల్లి శివారులోని ఓ గుడి వద్ద వదిలిపెట్టి లారీలో హరియాణకు వెళ్లిపోయారు. సీఐ ఆధ్యర్యంలో ప్రత్యేక బృందం ఈ కేసును విచారిస్తుండగా.. ఈ నెల 10న రాజస్థాన్‌కు చెందిన అదే కంటైనర్‌ కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కరీంనగర్‌ వద్ద వాహన తనిఖీ చేపట్టి కంటైనర్‌ను పట్టుకున్నారు. ఇందులో సపత్‌ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. దొంగతనం చేసిన నగదులో నుంచి లారీ యజమానికి రూ.లక్ష ఇచ్చారని, మిగిలిన నగదును అందరూ సమానంగా పంచుకున్నారని ఏసీపీ తెలిపారు. త్వరలోనే మిగతా నలుగురు నిందితులను పట్టుకుంటామన్నారు. సీఐ బొల్లం రమేశ్‌, ఎస్సై సాంబయ్యగౌడ్‌, క్రైం పార్టీ బృందం నెల్లి మోహన్‌, అవినాష్‌, రాజేశ్వర్‌రావు, సంపత్‌, విష్ణువర్ధన్‌లను సీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని