logo

శత శాతమే లక్ష్యం.. సంధించాలి అస్త్రం

ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ నమోదు లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రతి ఓటరూ తన హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు.

Updated : 12 Apr 2024 05:40 IST

వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్ద ఓటేసే అవకాశం
శాసనసభ ఎన్నికల్లో అవగాహన లోపంతో చాలా మంది దూరం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ నమోదు లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వివిధ సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రతి ఓటరూ తన హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకుంటోంది. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించారు. వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా బీఎల్‌వోలు(బూత్‌ లెవెల్‌ అధికారులు) ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, దివ్యాంగులకు 12-డీ పత్రాలు పంపిణీ చేస్తున్నారు.

వసతులు కల్పిస్తున్నా..

ప్రతి ఎన్నికల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దివ్యాంగులను, వృద్ధులను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు సమకూర్చుతున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద ర్యాంప్‌లు నిర్మించడంతో పాటు నడవలేని వారికి వీల్‌ ఛైర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయినా పోలింగ్‌ శాతం పెరగడం లేదు. వృద్ధులు, దివ్యాంగులకు ఓటేయాలని ఆసక్తి ఉన్నా, అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడం, నడవలేని స్థితిలో ఉండటంతో పోలింగ్‌ కేంద్రాలకు రాలేకపోతున్నారు.

నోటిఫికేషన్‌ తర్వాత 5 రోజులు

  • మంచానికే పరిమితమైన దివ్యాంగులు, వృద్ధుల గుర్తింపునకు బీఎల్‌వోలు అయిదు రోజులుగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
  • 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, ఓటరు గుర్తింపు కార్డులో 85 ఏళ్లు దాటి ఉన్న వారు ఇంటి నుంచి ఓటేయడానికి అర్హులు. బీఎల్‌వోలు సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించి, వారికి 12-డీ ఫారం అందజేస్తున్నారు.
  • 12-డీ ఫారంలో వివరాలు ఎలా పూరించాలో బీఎల్‌వోలు వివరిస్తున్నారు. పూరించలేని పరిస్థితిలో స్వయంగా వివరాలు నమోదు చేస్తున్నారు. ్య ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా అనంతరం అయిదు రోజుల వరకు 12-డీ ఫారాలు స్వీకరించనున్నారు.

శాసనసభ ఎన్నికల్లోనే మొదటిసారి..

రీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,88,392 మంది ఓటర్లుండగా ఇందులో 13,273 మంది వృద్ధులు, 43,579 మంది దివ్యాంగులున్నారు. పెద్దపల్లి పరిధిలో 15,92,996 మంది ఓటర్లకు 8,692 మంది వృద్ధులు, 35,099 మంది దివ్యాంగులు, నిజామాబాద్‌(జగిత్యాల, కోరుట్ల) పరిధిలో 4,78,868 మంది ఓటర్లకు 7,821 మంది వృద్ధులు, 20,946 మంది దివ్యాంగులున్నారు. ఇంటి వద్ద ఓటేసే విధానాన్ని మొదటిసారి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టడంతో ప్రచార లోపంతో ఆశించిన మేర ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం పోలింగ్‌ కేంద్రాల వారీగా దివ్యాంగ, వృద్ధ ఓటర్లను గుర్తించి ఫారాలు పంపిణీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని