logo

వృద్ధులకు ఆపన్నహస్తం

కన్నబిడ్డల కరుణకు దూరమైన వారు కొందరు.. ఏతోడు లేక ఆదరణ కరవైన వారు మరికొందరు.. జీవిత చరమాంకంలోని పండుటాకులకు అన్ని తామై చేయూత అందిస్తున్నారు.

Updated : 12 Apr 2024 05:37 IST

న్యూస్‌టుడే, రాయికల్‌

కన్నబిడ్డల కరుణకు దూరమైన వారు కొందరు.. ఏతోడు లేక ఆదరణ కరవైన వారు మరికొందరు.. జీవిత చరమాంకంలోని పండుటాకులకు అన్ని తామై చేయూత అందిస్తున్నారు. వృద్ధాప్యంలో తోడు నీడగా ఉంటూ నేనున్నానని మీకేంకాదని భరోసా కల్పిస్తూ మాధవ సేవతో పాటు మానవ సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీమతి చెన్నమనేని నివేదిత కృష్ణారావు.

రాయికల్‌ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ఎ.ఎన్‌.ఎల్‌. పార్శిల్‌ అధినేత దివంగత సి.హెచ్‌.ఎన్వీ కృష్ణారావు-నివేదిత దంపతులు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సొంత గ్రామానికి సేవ చేయాలని పలు గ్రామాల్లో ఆలయాలు నిర్మించారు. తన భార్య నివేదిత కోరిక మేరకు గ్రామ శివారులోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 10 ఎకరాలలో 2015లో నివేదిత వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏతోడు లేని అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత వసతితో పాటు భోజనాన్ని అందజేస్తున్నారు. 30 నుంచి 40 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క రాయికల్‌ మండల కేంద్రానికే పరిమితం కాకుండా జిల్లాలోని పలు గ్రామాల నుంచి వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. దినపత్రికలు, పుస్తకాలతో పాటు వారి కాలక్షేపానికి టి.వి. తదితర ఏర్పాట్లు చేశారు. వైద్య సేవలకు సైతం వసతులు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు.  2017లో కృష్ణారావు మృతి చెందినా నివేదిత ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం 36 మంది వృద్ధులు ఉండగా మరో 50 మందికి వసతి గదుల నిర్మాణం పూర్తి చేశారు. సాయప్ప ట్రస్టు ద్వారా రాయికల్‌ అయ్యప్ప ఆలయం, గణపతి ఆలయం, ఇటిక్యాల, కట్కాపూర్‌ గ్రామాల్లో సాయిబాబా ఆలయంతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఆలయాలు నిర్మించారు. ఓవైపు ఆధ్యాత్మికతతో పాటు మరోవైపు సామాజిక సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


ఆయన ఆలోచనే స్ఫూర్తి

- సీహెచ్‌ఎన్వీ నివేదిత కృష్ణారావు

మా ఆయన పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో గ్రామంలో ఆలయంతో పాటు నివేదిత ఆశ్రమాన్ని నిర్మించారు. 22 ఏళ్లుగా సాయ్యప్పట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మావారి ఆలోచన స్ఫూర్తి, గ్రామస్థుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. నివేదిత ఆశ్రమంలో వృద్ధులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని