logo

ఆరంభంలో అధికం.. ప్రస్తుతం మధ్యమం

వేసవికాలం ఆరంభం మార్చి నెలాఖరు, ఏప్రిల్‌ మొదటి వారంలో 41 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అధిక సమయం నడపడంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరిగాయి.

Updated : 12 Apr 2024 05:36 IST

వేసవిలో విద్యుత్తు వినియోగం తీరిది
భగభగ నుంచి సాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు
న్యూస్‌టుడే, భగత్‌నగర్‌

వేసవికాలం ఆరంభం మార్చి నెలాఖరు, ఏప్రిల్‌ మొదటి వారంలో 41 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అధిక సమయం నడపడంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరిగాయి. మరో వైపు వరికి పంటకు మరో పది రోజుల వరకు తడి అందించాల్సి రావడంతో బోరుబావుల మోటార్లు విరామం లేకుండా తిరుగుతున్నాయి. ఎండ వేడికి పగలు, రాత్రి మోటారు తిరిగితేనే గానీ పంటలకు తడి అందించలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వచ్చి.. మబ్బులు పడటం.. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండటంతో కరెంటు వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది.

బోరుబావులపైనే ఆధారం..

జిల్లాలో యాసంగిలో 3.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో వరి సాగు 2.50 లక్షల ఎకరాలు. జలాశయాల్లో నీరు అడుగంటడంతో బోరుబావులపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో 10,00,932 వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. జోరుగా బోరు బావులు ఉపయోగించడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. జనవరిలో సగటు జలమట్లం 6.67 మీటర్లు ఉంటే ప్రస్తుతం 8.43 మీటర్లకు పడిపోయింది. బోర్లలో నీరందక చివరి మడి తడవక రైతులు విద్యుత్తు మోటార్లను 18 గంటలపాటు విరామం లేకుండా వినియోగిస్తున్నారు. జిల్లాలో విద్యుత్తు వినియోగంతోపాటు గరిష్ఠ డిమాండ్‌ మాధ్యమ స్థాయికి వచ్చింది. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బహుబలి మోటార్లు నీటిని ఎత్తిపోయడంతో విద్యుత్తు వినియోగం పెరిగితే, ప్రస్తుతం వ్యవసాయ బోరుబావుల వినియోగం.. గృహాల్లో శీతలోపకరణాల వినియోగంతో ఆ స్థాయిలో పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

శీతలోపకరణలకు డిమాండు..

జిల్లాలో 5,40,966 వివిధ విద్యుత్తు కేటగిరీ సర్వీసులు ఉండగా, ఇందులో 3,70,880 గృహ సర్వీసులున్నాయి. వేసవి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున కూలర్లు ఏయిర్‌ కండీషన్లు వాడుతున్నారు. ఆయా కంపెనీలు ఏసీలను సులభ వాయిదాల్లో ఇస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఒకప్పుడు వేసవిలో రోజుకు రెండు, మూడు ఏసీలు విక్రయించే దుకాణాలు ప్రస్తుతం 7 నుంచి 8 వరకు విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గృహావసరాలకు ఉదయం.. సాయంత్రం విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మబ్బుపడితే తగ్గి.. వీడితే పెరిగి..

వారం రోజులుగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతూ.. మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోంది. 44 డిగ్రీల సెల్సియస్‌ ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 35 డిగ్రీలు సెల్సియస్‌కు పడిపోయాయి. విద్యుత్తు వినియోగం డిమాండ్‌ ఆ మేరకు పడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు