logo

అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

పలు విభాగాల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు తరచూ వెలుగు చూడటంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ప్రాంతీయ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కరీంనగర్‌ విభాగం జగిత్యాల పురపాలికకు ఈ నెల 3న తాఖీదులు జారీ చేసింది.

Updated : 13 Apr 2024 05:39 IST

జగిత్యాల బల్దియాలో పారిశుద్ధ్యం, టౌన్‌ప్లానింగ్‌ వివరాలు సమర్పించాలని ఆదేశం

జగిత్యాల పురపాలిక కార్యాలయం

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం:  పలు విభాగాల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు తరచూ వెలుగు చూడటంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ప్రాంతీయ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కరీంనగర్‌ విభాగం జగిత్యాల పురపాలికకు ఈ నెల 3న తాఖీదులు జారీ చేసింది. పారిశుద్ధ్య, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పుర కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఆయా రికార్డులు బల్దియా అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెండేళ్లుగా కమిషనర్లు మారటంతోపాటు ఏడాదిగా బల్దియాకు తాత్కాలిక అధ్యక్షుడే ఉండటంతో ప్రజాధనం దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్ష సభ్యులు అక్రమాలను కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

ఆరోపణలివీ..

పురపాలక సంఘంలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి చెత్త సేకరణ వాహనాలు తరచూ మరమ్మతుకు గురైనట్లు చూపి రెండేళ్లలో రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశారు. మరోవైపు డీజిల్‌ వినియోగంలోనూ ఎలాంటి కూపన్లు లేకుండా ప్రతినెలా రూ.3 నుంచి రూ.4 లక్షల మేర దుర్వినియోగం చేశారు. దీనికి ప్రతినెలా బిల్లుల్లో వచ్చిన తేడాలు స్పష్టం చేస్తున్నాయి. వాహనాలకు జియోట్యాగింగ్‌ లేకుండా మూడేళ్లకుపైగా వినియోగిస్తున్నారు. కావాలనే వాహనాల జియోట్యాగింగ్‌ తొలగించారనే ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య సిబ్బందికి బయోమెట్రిక్‌ విధానం సక్రమంగా అమలు చేయకపోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. భవన నిర్మాణ అనుమతుల్లో టీఎస్‌బీపాస్‌ ఆన్‌లైన్‌ విధానం ఉన్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో కొందరు సిబ్బంది యజమానుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అసెస్‌మెంట్‌ ధ్రువీకరణపత్రాల పేరిట కూడా అక్రమాలు చోటుచేసుకోవడం వివాదాస్పదమైంది.

కోరిన వివరాలివే..

  • పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించిన బడ్జెట్‌, కొనుగోలు చేసిన వాహనాలు, మరమ్మతులకైన ఖర్చులు, వాహనాల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
  •  సీజనల్‌ వ్యాధులపై ఇప్పటి వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు.
  •  ప్లాస్టిక్‌ నిషేధం ఏ విధంగా అమలు చేస్తున్నారు. దాడుల్లో దొరికిన ప్లాస్టిక్‌ ఎక్కడ భద్రపరిచారు, ఎక్కడికి తరలిస్తున్నారు.
  •  బయోమెట్రిక్‌ హాజరు విధానం తీరు, సిబ్బంది వివరాలు కోరారు.
  •  పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు నిబంధనల మేరకు జారీ చేస్తున్నారా? అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు తదితర వివరాలు సమర్పించాలని సూచించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని