logo

రాయితీ విత్తనాలపై రైతుల ఆశలు

వచ్చే వానాకాలం సీజనునుంచి రాయితీ విత్తనాల సరఫరాను పునరుద్ధరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం రైతులకు ఆశగా మారింది. వానాకాలం సీజనుకు విత్తనాలు ఇవ్వాలంటే ఇప్పట్నుంచే మేలైన వంగడాలను ప్రభుత్వం సేకరించి సరఫరాకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

Updated : 13 Apr 2024 05:39 IST

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

మార్కెట్లో వరి విత్తన సంచులు

వచ్చే వానాకాలం సీజనునుంచి రాయితీ విత్తనాల సరఫరాను పునరుద్ధరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం రైతులకు ఆశగా మారింది. వానాకాలం సీజనుకు విత్తనాలు ఇవ్వాలంటే ఇప్పట్నుంచే మేలైన వంగడాలను ప్రభుత్వం సేకరించి సరఫరాకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

  •  గతంలో అన్నిరకాల పంటల విత్తనాలను 50 శాతం రాయితీపై అందించేవారు. కొన్నేళ్లుగా కేవలం జనుము, జీలుగ విత్తనాలను మాత్రమే అత్యంత పరిమితంగా రాయితీపై ఇస్తున్నారు. దీంతో రైతులు బయటి మార్కెట్లో ప్రైవేటు విత్తనాలను పూర్తిధరకు కొనుగోలు చేసి ఆర్థిక భారానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కూరగాయలు సహా అన్నిరకాల విత్తనాలను రాయితీపై అందిస్తే రైతులకు ఆర్థిక ఆసరాగా ఉంటుంది.
  •  వానాకాలం సీజన్‌లో జిల్లాలో పరిస్థితులు అనుకూలిస్తే 4.34 లక్షల ఎకరాల్లో రైతులు అన్నిరకాల పంటలను సాగుచేస్తారు. ఇందులో వరిసాగే 3 లక్షల ఎకరాలుగా ఉండనుండగా గతంలో మాదిరిగా తెలంగాణ విత్తన, జాతీయ విత్తన కంపెనీ ద్వారా, జాతీయ ఆహార భధ్రత పథకంద్వారా విత్తనాలను రాయితీపై ఇవ్వాల్సిఉంది. ఇందుకు ఇప్పట్నుంచే రైతులనుంచి విత్తనాలను సేకరించి నిల్వచేస్తేనే వానాకాలంలో సరఫరా సాధ్యపడుతుంది.
  • కంపెనీలను బట్టి 5 కిలోల మొక్కజొన్న విత్తన ప్యాకెట్‌కు రూ.350 నుంచి రూ.1,500 వరకు ధరుండటంతో రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ సరఫరా లేనందున విత్తనాల ధరల నిర్ణయం కంపెనీల ఇష్టానుసారం మారి విత్తనాల ధరలు రెండేళ్లలోనే రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై విత్తనాలిస్తే కంపెనీలు కూడా ధర తగ్గిస్తాయి. జిల్లాలో అన్నిపైర్ల సాగు విస్తీర్ణాన్నిబట్టి రూ.90 కోట్లవరకు వెచ్చిస్తుండగా గతంలో మాదిరిగా ప్రభుత్వం 50 శాతం రాయితీని పునరుద్ధరిస్తే రూ.45 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆర్థిక లబ్ధి కలుగుతుంది. సర్కారు సరఫరాతో మేలైన విత్తనాలు తక్కువ ధరలు అందుబాటులోకి వస్తాయి, ప్రైవేటు కంపెనీల విత్తనాల ధరలు కూడా దిగివస్తాయి కాబట్టి సర్కారు విత్తన రాయితీపై రైతులు ఆశగా ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని