logo

పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించింది.

Updated : 13 Apr 2024 05:38 IST

జిల్లాలో 309 ఎంపికలు

ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు

న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించింది. పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి స్థానంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా  సంఘాల సభ్యులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో యూడైస్‌ ఆధారంగా 309 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసి వాటిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎంపికైన వాటిలో మన ఊరు- మనబడి కింద ఎంపికైనవి కూడా కొన్ని ఉండటంతో వాటిని తొలగించి, ఆ స్థానంలో మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలను చేేర్చారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి సిద్ధమవుతున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం

పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతులు కల్పించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ శాఖల ఇంజినీరింగ్‌ అధికారులు ఎంపికైన పాఠశాలలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన తర్వాత డబ్బులు తీసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో జాతీయ బ్యాంకులో ఖాతాలను తెరుస్తున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలల కమిటీలు ఖాతాలు తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.25 వేల లోపు విలువైన పనులు చేసిన తర్వాత పాఠశాలలో కమిటీ సమావేశమై డబ్బులను విత్‌డ్రా చేయనున్నారు. అలాగే రూ.లక్ష వరకు పనులకు ఎంపీడీవో అనుమతితో విత్‌డ్రా చేయనున్నారు. రూ.లక్ష పైగా విలువైన పనులు చేస్తే జిల్లా సమాఖ్యతోపాటు కలెక్టర్‌ అనుమతి తీసుకొని విత్‌డ్రా చేయనున్నారు. ఈ నిధుల వినియోగంపై కూడా అన్ని మండలాల్లో కమిటీలకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఛైర్‌పర్సన్‌గా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్‌పర్సన్‌గా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని ఎంపిక చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా, మహిళా సమాఖ్య సభ్యులు కమిటీలో ఉన్నారు. పట్టణం, గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ మహిళా సమాఖ్యలు ఉంటే పాఠశాలకు దగ్గరలో ఉన్న సమాఖ్య అధ్యక్షురాలిని ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా మహిళా సమాఖ్య సభ్యులుగా ఉన్న విద్యార్థుల తల్లులను తీసుకున్నారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. వీటి కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఈ కమిటీలు పాఠశాలల్లో తాగునీరు, తరగతి గదుల్లో చిన్న చిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్‌ సరఫరాలో సమస్యలను గుర్తించి పనులు చేయించనున్నాయి.


పనులు ప్రారంభిస్తాం

జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలుగా 309 ఎంపికయ్యాయి. వీటిలో కమిటీల పర్యవేక్షణలో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. పాఠశాలల్లో కమిటీలు వేసి, బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించాం. ఇప్పటికే ఇంజినీరింగ్‌ అధికారులు ఎంపికైన పాఠశాలలకు వెళ్లి పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వం సూచించిన మౌలిక వసతులు కల్పిస్తాం.

- జీఆర్‌ఆర్‌ శ్రీధర్‌కుమార్‌, జిల్లా కోఆర్డినేటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని