logo

రొయ్య ఎటుపోయిందో?

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జలాశయంలో రొయ్య పిల్లలను ఏటా వదులుతున్నారు. అయితే ఇవి మత్స్యకారుల వలకు చిక్కడం లేదు.

Updated : 13 Apr 2024 05:37 IST

మత్స్యకారుల వలకు చిక్కని వైనం

మధ్యమానేరు జలాశయంలో వదులుతున్న రొయ్యలు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, బోయినపల్లి : మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జలాశయంలో రొయ్య పిల్లలను ఏటా వదులుతున్నారు. అయితే ఇవి మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. జలాశయంలో వదిలినవి ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కోట్లలో పిల్లలను వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నా వందల్లో కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. సరైన నైపుణ్యం లేకపోవడంతో మత్స్యకారులు వాటిని పట్టడం లేదని చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం జలాశయంలో నీరు బాగా తగ్గినప్పటికీ అవి దొరకని పరిస్థితి ఉంది.

బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 27.5 టీఎంసీల సామర్థ్యంతో రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయం నిర్మించారు. ఇందులో ముంపునకు గురైన కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, శాభాష్‌పల్లి, సంకెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, చీర్లవంచ, చింతల్‌ఠాణా, గుర్రంవాణిపల్లి గ్రామాల నిర్వాసితులతోపాటు సమీప గ్రామాల్లోని మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జలాశయంలో నీటి నిల్వ అనంతరం 2018-19 నుంచి చేప, రొయ్య పిల్లలను వదులుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 1.3 కోట్ల రొయ్య పిల్లలను వదిలారు. నెల రోజుల వయసున్న 0.3 గ్రామాల బరువు ఉన్న పిల్లలను విడిచిపెట్టగా, సుమారు నాలుగు నుంచి అయిదు నెలల వ్యవధిలో 300 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు జలాశయంలో ఇవి అధికంగా లభిస్తాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.400 వరకు ధర పలుకుతోంది. అయితే మత్స్యకారులకు వ్యాపారులు మాత్రం రూ.200 చెల్లిస్తున్నారు.

నైపుణ్యం లేక...

జలాశయం పరిధిలో అనేక మంది మత్స్యకారులు ప్రధానంగా చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. వీరిలో కొంత మంది మాత్రమే చేపలు, రొయ్యలు పడుతుంటారు. వాటిని పట్టడంలో సరైన నైపుణం అవసరం. వాటికి సంబంధించి ప్రత్యేకమైన బుట్టలు అమర్చాల్సి ఉంటుంది. అయితే చేపల కోసం వేసిన వలలకు అప్పుడప్పుడు అరకొరగా పడుతున్నట్లు చెబుతున్నారు. రొయ్యలు పట్టకపోవడంతో అవి పెద్దవి అయి అందులోనే అంతరించిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జలాశయం పరిధిలోని గ్రామాల్లో చేపల విక్రయాలు తప్ప రొయ్యలు విక్రయాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.


శిక్షణ ఇస్తే పడతాం

జలాశయంలో ఏటా అధికారులు లక్షల్లో రొయ్య పిల్లలు వదులుతున్నారు. మత్స్యకారులకు సరైన నైపుణ్యం లేకపోవడంతో వాటిని పట్టడం లేదు. కొన్నింటిని పెద్ద చేపలు తింటుంటాయి. మరికొన్ని బరువు అధికమై నీటిలో మునిగి చనిపోతుంటాయి. అనేక మంది మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. రొయ్యలు పట్టడం లేదు.

 పందుల దేవయ్య, మత్స్యకారుడు, కొదురుపాక


నీరు తగ్గినప్పుడు అవకాశం

జలాశయంలో నీరు తగ్గినప్పుడు మాత్రమే రొయ్యలు పట్టడానికి వీలుంటుంది. వాటిని పట్టడానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం. మాకు సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల వాటిపై ఆసక్తి చూపడం లేదు. రోజూ చేపల వేట కొనసాగించి జీవనోపాధి పొందుతున్నాం. శిక్షణ ఇస్తే రొయ్యలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాం.

 శ్రీనివాస్‌, మత్స్యకారుడు, కొదురుపాక


ఆశించిన ఉత్పత్తి వస్తుంది

మత్స్యకారులకు చేపలతో పాటు రొయ్యల ద్వారా ఉపాధి అధికంగా ఉంటుంది. జలాశయంలో ఏటా వదులుతున్న రొయ్యలను మత్స్యకారులు పడుతున్నారు. చేపల వలలకు చిక్కుతున్నాయి. ఆశించిన ఉత్పత్తి వస్తుంది. వాటిని పట్టేందుకు మత్స్యకారులకు శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.

 శివప్రసాద్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని