logo

మరమగ్గంపై ఏడాదంతా పని

జిల్లాలోని నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్షేమశాఖలకు అవసరమయ్యే మొత్తం వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Updated : 13 Apr 2024 05:36 IST

ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లపై దృష్టి
 పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యం, నైపుణ్యాలపై సమాచార సేకరణ

టెక్స్‌టైల్‌ పార్కులోని మరమగ్గాల పరిశ్రమ

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల : జిల్లాలోని నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్షేమశాఖలకు అవసరమయ్యే మొత్తం వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఇటీవల ఉత్తర్వులను వెలువరించింది. కాగా 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వ వస్త్రోత్పత్తుల ఆర్డర్లలో సరైన ప్రణాళిక లేకపోవడం, వస్త్రోత్పత్తి వర్గాలు పూర్తిగా ప్రభుత్వ ఆర్డర్లకే పరిమితం కావడంతో దశాబ్దాలుగా ఇక్కడికి వస్తున్న ప్రైవేటు ఆర్డర్లు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయి. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ కుదుపునకు లోనైంది. దీంతో ఇక్కడున్న మరమగ్గాల ఉత్పత్తి సామర్థ్యం, కార్మికుల నైపుణ్యం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లు తీసుకోవడం, వీరి సొంత ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్‌ కల్పించడం ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

చేనేత, మర నేత ఇద్దరికీ ఉపాధి

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చేనేత, మరమగ్గాల మ్యాక్స్‌ సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు 2023 నవంబరు వరకు టెస్కో సుమారు రూ. 499.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో సగానికిపైగా బతుకమ్మ చీరలకు సంబంధించినవే ఉన్నాయి. విడతల వారీగా విడుదల చేయనున్నారు. ప్రభుత్వ ఆర్డర్లలో ముడిసరకును ప్రభుత్వమే సరఫరా చేసి, ఉత్పత్తి చేసిన వస్త్రం సేకరించనున్నారు. వస్త్రోత్పత్తిదారులకు జీఎస్టీ భారం తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లు ఏవైనా నూలు కొనుగోలుపై ప్రభుత్వం 20 శాతం రాయితీని అందిస్తే  వస్త్రాల విక్రయాల విపణిలో ఒడుదొడుకులు ఎదురైనా నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుందని వస్త్రోత్పత్తి వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్నే ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.

నైపుణ్య శిక్షణ అవసరం

జాతీయ, అంతర్జాతీయ వస్త్రోత్పత్తుల విపణిలో పోటీని తట్టుకోవాలంటే పరిశ్రమ వర్గాలకు నైపుణ్య శిక్షణ అవసరం. కార్మికులకు వస్త్రోత్పత్తుల డిజైన్లు, నాణ్యతపైన, యజమానులు, ఆసాములకు మార్కెటింగ్‌లో వస్తున్న మార్పులు, వాటిలో మెలకువలపై ఎప్పటికప్పుడు శిక్షణ అవసరం. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూం టెక్నాలజీ ఏర్పాటు, కొత్త పవర్‌లూం క్లస్టర్‌ అభివృద్ధి, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిజైన్ల కేంద్రం ఏర్పాటు, రాష్ట్రంలో టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. వీటితోపాటు నేతన్నల కోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పథకాలను అనుసంధానం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

  •   ఇప్పటికే టీ-నేతన్న యాప్‌లో కార్మికులు, ఆసాములు, అనుబంధ రంగాల వారితోపాటు మరమగ్గాల సమాచారాన్ని సేకరించారు. దీనిలో ఆసాములు 1,715, కార్మికులు 324, అనుబంధ రంగాల్లో 1,838 మంది నమోదు చేసుకున్నారు. కార్మికులు ముందుకు రాకపోవడంతో చేనేత, జౌళిశాఖ కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్‌తో నేరుగా కార్మికుల కాలనీలు, వారు పని చేస్తున్న కార్ఖానాలకు వెళ్లి నమోదు చేస్తున్నారు. 2023లో 139 మ్యాక్స్‌ సంఘాలు, 142 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వ వస్త్రోత్పత్తుల ఆర్డర్లు, రాయితీలు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. రాష్ట్ర ఉన్నతాధికారుల విచారణలో 22 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు బోగస్‌గా గుర్తించారు.
  •  గత ప్రభుత్వ ఆర్డర్లలో కొనుగోలు చేసిన నూలుపై అప్పుడున్న మార్కెట్‌ ధరలకు మించి బిల్లులు కోడ్‌ చేసినట్లు గుర్తించారు. ఫలితంగా వీటి రాయితీ కూడా పక్కదారి పట్టినట్లు లెక్కల్లో వెల్లడైనట్లు సమాచారం. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఏకరూప దుస్తులకు అవసరమైన నూలును చేనేత జౌళిశాఖయే కొనుగోలు చేసి అందించింది. అలాగే నేతన్నల కోసం విడుదలైన పలు రాయితీలకు ప్రభుత్వం నుంచి సరైన ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తించారు.

అక్రమాలకు అడ్డుకట్ట

జిల్లాలోని సుమారు 28 వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటిలో 16 వేలు డాబీ, జకార్డు అమర్చినవి కాగా 12 వేలు సాధారణ మగ్గాలు ఉన్నాయి. వీటితోపాటు 103 చేనేత మగ్గాలు, 103 మంది కార్మికులు ఉండగా, వాటి అనుబంధ రంగాల్లో 74 మంది కార్మికులు ఉన్నారు. డాబీ, జకార్డులపై డిజైన్లతో కూడిన వస్త్రోత్పత్తులు వస్తాయి. సాధారణ వాటిపై పాలిస్టర్‌, కాటన్‌ ఉత్పత్తులు జరుగుతాయి. ఇవి నిరంతరాయంగా నడిస్తే రోజుకు సగటున 10 లక్షల మీటర్ల పాలిస్టర్‌, 5 లక్షల మీటర్ల కాటన్‌ వస్త్రం ఉత్పత్తి జరుగుతుంది. నేతన్నల సంక్షేమానికి తాత్కాలిక ప్రయోజనం కన్నా దీర్ఘకాలిక లబ్ధి చేకూరేలా నేతన్న భరోసా పేరుతో పథకాన్ని రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని