logo

కోతలు లేకుండా..సమస్యలు రాకుండాపకడ్బందీగా యాసంగి ధాన్యం సేకరణ

‘రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, నిర్వాహకుల కొర్రీలు నియంత్రిస్తున్నాం. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం.

Updated : 13 Apr 2024 06:06 IST

అదనపు పాలనాధికారి శ్యామ్‌ప్రసాద్‌లాల్‌

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ‘రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, నిర్వాహకుల కొర్రీలు నియంత్రిస్తున్నాం. ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. గత తప్పిదాలను అధిమించే ప్రణాళిక రూపొందించా’మని అదనపు పాలనాధికారి శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తెలిపారు. నిబంధనలకు లోబడి ధాన్యాన్ని సేకరిస్తామన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సీజన్‌లో కొత్తగా ఐరిస్‌తో కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ, కేంద్రాల్లో మౌలిక వసతులు, ఇతరత్రా సమస్యలపై ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.

 

ప్ర : గత అడ్డంకులు అధిగమించి తీసుకునే చర్యలు ఏమిటి?

 స : ధాన్యం సేకరణలో పకడ్బందీగా ప్రణాళిక రచించాం. మిల్లర్లు, నిర్వాహకులతో పలు మార్లు సమీక్షించాం. ఎక్కడా ఇబ్బందులు కలిగించరాదని సూచించాం. జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం విధించాం. తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించనున్నాం. ప్రస్తుతం 72 మిల్లులకు అనుమతి ఇచ్చాం.

ప్ర : మిల్లర్లు, నిర్వాహకుల కొర్రీలను ఎలా అడ్డుకోబోతున్నారు?

స : ధాన్యం కొనుగోళ్లలో రైతులు నిబంధనలు పాటించాలి. 17 శాతం తేమ, నాణ్యమైన ధాన్యం కోసం తూర్పార పట్టాలి. ధాన్యంలో మట్టిపెళ్లలు లేకుండా చేసేందుకు ప్యాడీ క్లీనర్లను సమకూర్చాం. నిబంధనలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తే చర్యలు తప్పవు. తరుగు పేరిట కోతలు విధించకూడదని స్పష్టం చేశాం.

ప్ర : ఐరిస్‌ విధానంపై రైతులకు మీరిచ్చే సూచనలు ?

స : ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు కొత్తగా ఐరిస్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. పట్టా పాసుపుస్తకం కలిగిన రైతు ఉండాల్సిన అవసరం లేదు. వారి కుటుంబ సభ్యులు ఉన్నా కొనుగోలు చేస్తాం. ఎలాంటి అపోహ అవసరం లేదు.  

ప్రశ్న : జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

సమాధానం : జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ముందుగా 305 కేంద్రాలను ప్రతిపాదించగా రైతుల నుంచి విజ్ఞప్తులు రావడంతో 313 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాం. జిల్లాలో 250 సహకారశాఖ, 63 ఐకేపీ కేంద్రాలున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో రైతులకు నీడ, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. తూకం యంత్రాలు, తేమశాతం పరీక్షించే పరికరాలను సమకూర్చా.

ప్ర : హమాలీలు, లారీల కొరతను ఎలా పరిష్కరించనున్నారు?

స : ధాన్యం సేకరణ సమయంలో హమాలీల సమస్య కొంత ఎదురవుతోంది. గ్రామాల్లో హమాలీల వివరాల జాబితా సిద్ధం చేశాం. అవసరమైన చోట ఎక్కువ మందిని తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. లారీల యజమానులతో సమీక్షించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని