logo

నీళ్ల వేటలో నిబంధనలు బేఖాతరు

భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు అవసరాలతో పాటు తాగడానికి నీటి ఎద్దడి తీవ్రమైంది. పంటలను కాపాడుకొనేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

Updated : 13 Apr 2024 06:10 IST

బోరుబావుల తవ్వకాల్లో వాల్టా అమలేదీ!

ఈనాడు, పెద్దపల్లి : భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు అవసరాలతో పాటు తాగడానికి నీటి ఎద్దడి తీవ్రమైంది. పంటలను కాపాడుకొనేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనావాస ప్రాంతాల్లో తాగునీటి కోసం వెంపర్లాట మొదలైంది. ఈ క్రమంలో బోరుబావుల తవ్వకం జోరందుకుంది. 80 శాతం బోర్లలో చుక్క నీరు రాకున్నా రైతులు ప్రయత్నాలు మానుకోవడం లేదు.

ఉమ్మడి జిల్లాలో నీరు భూమి వృక్ష చట్టం(వాల్టా) నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. నాలుగు జిల్లాల్లో కలిపి ప్రతి రోజూ దాదాపు 235 బోర్లు వేస్తున్నారు. ఇందులో 130కి పైగా అనుమతి ఉండటం లేదు. రైతులు ఒక్కో బోరును గరిష్ఠంగా 130 మీటర్ల వరకు వేస్తున్నారు. ఇందుకోసం రూ.60 వేల వరకు వెచ్చిస్తున్నారు. ఎంతో కొంత నీళ్లు వస్తాయనే ఆశతో మోటార్లు, పైపులు వేయడానికి మరో రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. బోరుబావుల కోసం ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు రైతులు వెచ్చిస్తున్నారు.

 అడుగడుగునా ఉల్లంఘన

  •  గతేడాది అక్టోబరు తర్వాత వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సామర్థ్యానికి మించి నీటి వినియోగం జరుగుతుండటంతో ఎద్దడి తీవ్రమైంది. ఈ క్రమంలో వాల్టా అడుగడుగునా ఉల్లంఘనకు గురవుతోంది.
  •  అవసరం ఏదైనా బోరుబావి తవ్వకానికి కచ్చితంగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వాల్టా అమలు కోసం జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో అదనపు కలెక్టర్‌, తహసీల్దార్‌, డీఎస్పీ, ఎస్సై, డీఆర్‌డీవో, జిల్లా భూగర్భ జల అధికారి, విద్యుత్తు శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.
  •  బోర్ల తవ్వకానికి రూ.1000 చెల్లించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బోర్లకు వాటర్‌ఫ్లో మీటర్లు బిగించాల్సి ఉంటుంది.
  •  భూమిలో 120 మీటర్ల లోతు దాటకుండా 6.5 అంగుళాలతో డ్రిల్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ అవసరాలకు మాత్రం 7 అంగుళాల వ్యాసార్థంతో బోరుబావి తవ్వుకోవచ్చని పెద్దపల్లి జిలా భూగర్భ జల శాఖ అధికారి రవిశంకర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. కొత్త నీటి చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి బోర్లు తవ్విన వారికి నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

  ఇవీ నిబంధనలు

  •  బోర్ల ద్వారా వినియోగిస్తున్న నీటికి ఇప్పటివరకు లెక్కలు లేవు. వాల్టా ప్రకారం ప్రతి బోరుకు వాటర్‌ ఫ్లో మీటర్‌ బిగించాల్సి ఉంటుంది.
  •  నీటి శుద్ధి ప్లాంట్లు, పరిశ్రమలు, మైనింగ్‌ ప్రాజెక్టులు, రైస్‌మిల్లులు, హోటళ్లు, రిసార్టులు, అపార్టుమెంట్లు, కళాశాలలు, వసతిగృహాలు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
  •  అపార్ట్‌మెంట్‌లో బోర్లకు అయిదేళ్లకోసారి రూ.10 వేలు, శుద్ధ జల ప్లాంట్లకు మూడేళ్లకు రూ.14,500, మైనింగ్‌ ప్రాజెక్టులకు రెండేళ్లకు రూ.లక్ష, పరిశ్రమలకు రూ.14,500, శిక్షణ కేంద్రాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
  •  శుద్ధి కేంద్రాలు రోజుకు 50 వేల లీటర్ల నీటిని వినియోగిస్తే ప్రతి 1000 లీటర్లకు ఒక రూపాయి, 51 వేల లీటర్లు దాటితే ప్రతి వెయ్యి లీటర్లకు రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  •  పరిశ్రమలు, గనుల నిర్వహణకు 2 లక్షల లీటర్ల వరకు రూపాయి, 2 లక్షల నుంచి 10 లక్షల లీటర్ల వరకు రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  •  వాణిజ్య(కమర్షియల్‌) బోరుబావికి తప్పనిసరిగా డిజిటల్‌ ఫ్లో మీటర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజు వినియోగించిన భూగర్భ జలాల లెక్కను పక్కాగా నమోదు చేయాలి.
  •  భూగర్భ జలం ఎంత లోతులో ఉందో తెలుసుకోవడానికి ఫిజోమీటర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఆ మీటరు ద్వారా ప్రతి నెలా నీటి మట్టం వివరాలు భూగర్భజల వనరుల శాఖకు వెళ్తాయి.
  •  శుద్ధ జల ప్లాంటు వద్ద ఇంకుడుగుంతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వృథా జలాలను మురుగు కాలువల్లోకి వదిలేయవద్దు. ప్రతి రోజు వినియోగించుకొనే బోరుబావి నీటిని లాగ్‌బుక్‌లో నమోదు చేయాలి. నీటి ట్యాంకర్లకు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 వేల వరకు ప్లాంట్లుండగా 70 శాతం నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి.
  •  బోర్‌వెల్‌ సంస్థలు తమ వాహనాలు, యంత్రాల వినియోగంపై కచ్చితంగా భూగర్భజల శాఖ వద్ద అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో బోర్‌వెల్‌ సంస్థలున్నా ఏటా అనుమతులను పునరుద్ధరించుకోవడం లేదు. కొందరు కాలం చెల్లిన బోర్‌వెల్‌ యంత్రాలు, వాహనాలనే నడిపిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు