logo

నీటి నిర్వహణలో అమృత్‌ మిత్ర

నగరాలు, పట్టణాల్లో నీటి నిర్వహణ తీరును మెరుగు పరచడంతో పాటు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్‌ మిత్రల నియామకానికి శ్రీకారం చుట్టారు.

Updated : 13 Apr 2024 05:33 IST

స్వశక్తి మహిళలకు పర్యవేక్షణ బాధ్యతలు 

నగరంలో అమృత్‌ నిధులతో నిర్మించిన ట్యాంకు

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం : నగరాలు, పట్టణాల్లో నీటి నిర్వహణ తీరును మెరుగు పరచడంతో పాటు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్‌ మిత్రల నియామకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ‘అమృత్‌-02’ నిధులతో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచనున్న నగరాలు, పట్టణాల్లో మొదటగా అమృత్‌ మిత్రలను ఏర్పాటు చేయనున్నారు. నీటి నిర్వహణ, సరఫరాలో మెరుగైన చర్యలు తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. తాగునీరు, ఉద్యానవనాలు, మురుగు జలాల శుద్ధి నిర్వహణను మెరుగు పరిచేందుకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసేలా నిబంధనలను విధించారు. ఈ పనులు స్వశక్తి మహిళల ద్వారానే చేపట్టాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి 1500 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశముంది. ‘అమృత్‌ మిత్ర’ ప్రాజెక్టుల్లో మూడు శాతం నిధులను ప్రత్యేక శిక్షణల ద్వారా ఆయా ప్రాంతాల్లోని మహిళల సామర్థ్యాల పెంపుదల కోసం వినియోగించనున్నారు. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే మొదటగా అవకాశం ఇవ్వనున్నారు. మొదటి దశలో కరీంనగర్‌, రామగుండం నగరపాలికల్లో ‘అమృత్‌ మిత్ర’ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు.

 అర్హతలు

అమృత్‌ మిత్రల ఎంపిక కోసం సంబంధిత స్వశక్తి సంఘం తప్పనిసరిగా నేషనల్‌ అర్బన్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌(ఎన్‌.యు.ఎల్‌.ఎం.)లో నమోదు చేసుకొని ఉండాలి. ఆయా నిబంధనల అమలు, క్రమం తప్పకుండా సమావేశాలు, పొదుపు, అంతర్గత రుణసాయం, రుణాల చెల్లింపు, దస్త్రాల నిర్వహణ తదితర పంచసూత్రాలను పాటిస్తుండాలి. సంబంధిత స్వశక్తి సంఘంలో కనీసం ఒకరు 8వ తరగతికి పైగా చదువుకొని ఉండాలి. సంఘం పేరుతో బ్యాంకు ఖాతా ఉండాలి. సంఘం సభ్యులపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండరాదు. గతంలో నీటి నిర్వహణలో పాల్గొన్న స్వశక్తి సంఘాలకు ప్రాధాన్యం ఉంటుంది. అత్యంత ఉత్సాహంగా పనిచేసి తాగునీరు, మురుగు జలాల శుద్ధి, ఉద్యానవనాల నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన ‘అమృత్‌ మిత్ర’లకు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయనున్నారు.

విధి విధానాలు ఇవీ..

  •  ఎంపిక చేసిన స్వశక్తి సంఘాలను ‘అమృత్‌ మిత్ర’గా నియమిస్తారు. నీటి నిర్వహణే ప్రధాన అంశంగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
  •  ఇంటింటికీ మెరుగైన తాగునీరు అందించేలా పర్యవేక్షించడంతో పాటు ఆయా నివాసాల్లోని మహిళలకు నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తారు. నీటి నిర్వహణలో ఆరోగ్యకర జీవన విధానాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటారు. నీటి వినియోగం మీటర్ల ఏర్పాటు, లీకేజీల నివారణలోనూ ‘అమృత్‌ మిత్ర’ కీలకపాత్ర పోషించనున్నారు.
  •  నీటి నిర్వహణ, సరఫరాలో ‘అమృత్‌ మిత్ర’లు పూర్తి బాధ్యతలను తీసుకుంటూ ప్రజలకు, పట్టణ, స్థానిక సంస్థలకు అనుసంధానంగా వ్యవహరిస్తారు. నీటి దుబారా వల్ల ఎదురయ్యే కష్టాలను ప్రజలకు వివరిస్తారు. నీటి నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకంగా పర్యవేక్షిస్తారు.
  •  ఉద్యానవనాలు, మురుగు జలాల శుద్ధి కేంద్రాలు, మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల నిర్వహణ తీరును ‘అమృత్‌ మిత్ర’లు పర్యవేక్షించనున్నారు. ఆయా విభాగాల నిర్వహణను మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి దానికి అనుగుణంగా సాంకేతికపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు.

ఎంపిక ప్రక్రియ పూర్తయింది

 సుచరణ్‌, ఈఈ, రామగుండం కార్పొరేషన్‌

నగరంలో అర్హతలు కలిగిన, నిర్వహణలో ఉత్సాహంగా ఉన్న స్వశక్తి సంఘాలను ‘అమృత్‌ మిత్ర’లుగా ఎంపిక చేశాం. తాగునీటి సరఫరా, మురుగు జలాల శుద్ధి, ఉద్యానవనాలు, నర్సరీల నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు. వారికి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఆయా అంశాలను అమలు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని