logo

రచనలతో సామాజిక చైతన్యం

సిరిసిల్లకు చెందిన పలువురు మహిళా సాహితీవేత్తలు సాహిత్యంలో విశేష కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. సామాజిక అంశాలు, మహిళల సమస్యలు, బాలల గురించి రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Updated : 13 Apr 2024 05:33 IST

ఆదర్శంగా నిలుస్తున్న సాహితీవేత్తలు 

న్యూస్‌టుడే, సిరిసిల్ల (విద్యానగర్‌) : సిరిసిల్లకు చెందిన పలువురు మహిళా సాహితీవేత్తలు సాహిత్యంలో విశేష కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. సామాజిక అంశాలు, మహిళల సమస్యలు, బాలల గురించి రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

 బాలలను ప్రోత్సహిస్తూ...

సిరిసిల్లకు చెందిన వడ్డేపల్లి సంధ్య రుద్రంగి ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిసున్నారు. ఆమెకు పాఠశాల, కళాశాల స్థాయి నుంచే సాహిత్యంపై మక్కువ ఎక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రాచ్య భాషల విభాగంలో డా.సిల్మా నాయక్‌ మార్గదర్శనంలో డా.సినారె సినీ గీతాలు వస్తు శిల్ప వివేచన అనే అంశంగా పీహెచ్‌డీ చేశారు. యోచన, సంహిత, చేతన, జరీపూల నానీలు, బాల లయలు, చిటపట చినుకులు పుస్తకాలను రచించారు. ఇల్లు కోసం వెతుకులాట పుస్తకాన్ని అనువదించారు. తారంగం తారంగం వంటి అనేక వ్యాసాలు రాశారు. ఓవైపు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతూనే బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. బాలలకు చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై తన రచనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బాలలను సాహిత్యం వైపు ప్రోత్సహిస్తున్నారు. సంధ్య లేడీ లెజెండ్‌ అవార్డు, బీఎస్‌రాములు స్ఫూర్తి పురస్కారం, మహతి మహిళా శక్తి, పెందోట బాలసాహిత్య, కాళోజీ రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు.

మహిళా సాధికారతపై...

సిరిసిల్లకు చెందిన కొలిపాక శోభారాణి విశ్రాంతి సెస్‌ ఉద్యోగిని. మహిళల సమస్యలు, సంక్షేమం, బాలల గురించి రచనలు చేస్తున్నారు. ఆమెకు ముందు నుంచి సాహిత్యాభిరుచి ఎక్కువ. చలనం కవితా సంపుటి రచించారు. అనేక ఆకాశాలు, స్వయం సిద్ధలో కథలు, తీరొక్క పూలు పుస్తకాలలో కవిత్వం రచించారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, అలిశెట్టి ప్రభాకర్‌ పురస్కారాలు అందుకున్నారు. సామాజిక అంశాలతో పాటు మహిళల సమస్యలపై రచనలు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.

అంశాలే కథా వస్తువులుగా...

సిరిసిల్లకు చెందిన శ్రీమతి తంగళ్లపల్లి కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. సామాజిక అంశాలు, ఆధ్యాత్మిక రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వేదాంత మహాసభలు జరిగిన సమయంలో ‘39వ వేదాంత విజ్ఞాన మహాసభలు’ పుస్తకం రచించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘ప్రయాణం’ అనే పుస్తకాన్ని అనువదించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘నెల్లూరు కేశవస్వామి కథలు, నిజాం యుగాంత పరిణామాలు’ అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు రచించి ప్రశంసలు అందుకున్నారు. ఎక్కువగా సమాజాన్ని చైతన్యవంతం చేసే రచనలు రాస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని