logo

ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి దుర్మరణం

మెట్‌పల్లి మండలం చౌలమద్ది శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Updated : 13 Apr 2024 05:32 IST

ముగ్గురికి తీవ్ర గాయాలు 

మెట్‌పల్లి, కోరుట్ల, న్యూస్‌టుడే: మెట్‌పల్లి మండలం చౌలమద్ది శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి పట్టణంలోని ముస్లింపురకు చెందిన మిర్జాఖాజాపాషా(38) కుటుంబ సభ్యులతో కలిసి పనినిమిత్తం కోరుట్లకు వెళ్లారు. ఇద్దరు కూతుళ్లు అయేషా, అలీషాతో కలిసి ద్విచక్ర వాహనంపై మెట్‌పల్లికి బయలుదేరారు. కోరుట్లకు చెందిన తోగిటి వెంకటేశ్‌(28), ఇందూరి శ్రీనివాస్‌ ద్విచక్ర వాహనంపై మెట్‌పల్లికి వెళ్లి కోరుట్లకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో మారుతినగర్‌ శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మిర్జాఖాజాపాషా, వెంకటేశ్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకోగా అంబులెన్స్‌లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలైన శ్రీనివాస్‌, అయోష, అలీషాను 108లో మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించారు. మెట్‌పల్లి ఎస్సై చిరంజీవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.


బావిలో పడి యువకుడి మృతి 

మర్రిపల్లిలో విషాదం

వేములవాడ గ్రామీణం, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ వెళ్లేందుకు వాహనంపై బయలుదేరిన విద్యార్థి దారిలో నిద్రావస్థను తప్పించుకునేందుకు పిట్ట గోడపై పడుకోగా పక్కనున్న బావిలో పడిపోయి మృత్యువు పాలయ్యాడు. సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రాచర్ల మల్లేశంకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయికృష్ణ కౌశిక్‌ (22) హైదరాబాద్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉగాది పండగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. గురువారం రాత్రి పది గంటలకు తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ బయల్దేరాడు. సిద్దిపేట పరిధిలోని ఇమాంబాద్‌ గ్రామ శివారులోకి రాగానే నిద్ర రావటంతో వాహనాన్ని ఆపి వ్యవసాయ బావికి ఆనుకొని ఉన్న గోడపై నిద్రించాడు. గాఢ నిద్రలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్థులు గమనించి  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్రేన్‌ సహాయంతో బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షలకని వెళ్లిన కొడుకు శవమై రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


నకిలీ ఉద్యోగ నియామక పత్రంతో పట్టుబడ్డ యువతి

కోరుట్ల, న్యూస్‌టుడే: నకిలీ ఉద్యోగ నియామక పత్రంతో ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన ఓ యువతిని గుర్తించి పోలీసులకు అప్పగించిన ఘటన శుక్రవారం కోరుట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కోరుట్ల పట్టణానికి చెందిన ఓ మహిళ ఎంఎల్‌టీ పూర్తి చేసింది. శుక్రవారం ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగం వచ్చిందని నకిలీ నియామక పత్రాలను తీసుకుని పట్టణంలోని అల్లమయ్యగుట్ట వద్దనున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ అనిల్‌కు అనుమానం వచ్చి వెంటనే జిల్లా వైద్యాధికారికి విషయం తెలిపారు. ఇటీవల ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని, ఎవరికి ఉద్యోగ నియామక పత్రం అందజేయలేదని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని యువతిని, నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి వద్ద పొందినట్లు విశ్వసనీయ సమాచారం.


విశ్రాంత ప్రిన్సిపల్‌కు జైలుశిక్ష

కరీంనగర్‌ న్యాయవార్తలు, న్యూస్‌టుడే : కోర్టు ఉత్తర్వుల ప్రకారం సకాలంలో దావ దాఖలు చేసిన వ్యక్తికి డబ్బు చెల్లించకపోవడంతో ప్రతి వాది అయిన కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ను 30 రోజులపాటు జైలుకు తరలించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాది విశ్వప్రసాద్‌ కథనం మేరకు.. కరీంనగర్‌ వావిలాలపల్లికి చెందిన విశ్రాంత లెక్చరర్‌ వెంగళ రమణయ్య హుస్నాబాద్‌ జూనియర్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ విజయ మారుతి ఒకప్పుడు స్నేహితులు. విజయమారుతి తన అవసరాల నిమిత్తం రమణయ్య వద్ద నుంచి డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీనిపై రమణయ్య కోర్టులో దావా దాఖలు చేయగా వడ్డీతో సహా డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం డబ్బును విజయమారుతి చెల్లించకపోవడంతో మళ్లీ రమణయ్య కోర్టును ఆశ్రయించారు. దీనిపై నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విజయమారుతి డబ్బు చెల్లించకపోవడంతో 30 రోజులపాటు జైలు(సివిల్‌ ప్రిజిన్‌)కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రమణయ్య, విజయమారుతి ఇద్దరు ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని