logo

యోధుల అడ్డా.. కరీంనగర్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ప్రత్యేకత చాటుకుంటోంది. ఒక ఉప ఎన్నిక మినహాయిస్తే 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 17 సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి ఎన్నికైన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకోవడం విశేషం.

Updated : 13 Apr 2024 06:08 IST

లోక్‌సభ స్థానానికి ప్రముఖుల ప్రాతినిధ్యం 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ప్రత్యేకత చాటుకుంటోంది. ఒక ఉప ఎన్నిక మినహాయిస్తే 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 17 సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి ఎన్నికైన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకోవడం విశేషం. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర స్థాయి పదవుల్లో ఘనత చాటుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థులు ఎక్కువ సార్లు విజయం సాధించారు.

గులాబీ దళపతి

మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో భారాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు 2004 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొంతకాలం కేంద్ర మంత్రిగానూ పని చేశారు. నాటి కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర మంత్రి ఎమ్మెస్సార్‌ చేసిన సవాల్‌ స్వీకరించి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. రాష్ట్రం ఆవిర్భవించాక శాసనసభ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

చొక్కారావు హ్యాట్రిక్‌ విజయం

1952 నుంచి ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఘనత కాంగ్రెస్‌ నేత జువ్వాడి చొక్కారావుకే దక్కింది. 1984, 1989, 1991 ఎన్నికల్లో ఆయన గెలిచారు. అంతకుముందు స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో కలిసి పని చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, జడ్పీ ఛైర్మన్‌గా సేవలందించిన చొక్కారావు నిరాడంబర జీవితానికి నిలువుటద్దంగా గుర్తింపు పొందారు.

  •  1962, 67 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి జె.రమాపతిరావు రెండు సార్లు, 1952, 57లలో కాంగ్రెస్‌తో పాటు పార్టీ అనుబంధ విభాగం నుంచి ఎం.ఆర్‌.కృష్ణ రెండు సార్లు విజయం అందుకున్నారు.

రాష్ట్ర స్థాయిలో కీలకం

  •  ప్రస్తుత ఎంపీ, రెండోసారి బరిలో దిగిన భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  •  2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉమ్మడి రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పని చేశారు.
  •  1996 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా గెలిచిన ప్రస్తుత భారాస ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ్య 2014లో భారాస నుంచి గెలిచిన వినోద్‌కుమార్‌ పార్టీ లోక్‌సభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ పని చేశారు.

  ఉద్యమ నేత బద్దం బోణీ

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి కరీంనగర్‌ మొదటి ఎంపీగా ఎన్నికయ్యారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ తరఫున బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటంతో పీడీఎఫ్‌ నుంచి పోటీ చేశారు. 1953లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం సడలించాక రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎల్లారెడ్డి సేవలు గుర్తు చేసుకుంటూ కరీంనగర్‌ కూరగాయల మార్కెట్‌ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 టీపీఎస్‌ నుంచి ఎమ్మెస్సార్‌

ఎం.సత్యనారాయణరావు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మూడు సార్లు జైలుకు వెళ్లారు. ఆ సమయంలో పురుడు పోసుకున్న తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్‌) ద్వారా ప్రజల మధ్యకు వచ్చారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి టీపీఎస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు.

మొదటిసారి లోక్‌సభలో అడుగు పెట్టడంతోనే డిప్యూటీ లీడర్‌గా పని చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో టీపీఎస్‌ విలీనం కాగా ఎమ్మెస్సార్‌ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. 1977-1980 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి నాటి ప్రధాని ఇందిరకు అత్యంత నమ్మకస్థుడిగా మెలిగారు. 1980 నుంచి 1983 వరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శిగా పని చేసి ఆరు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా పని చేశారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉండటంతో పాటు అభివృద్ధి పనులతో గుర్తింపు పొందారు. అనంతరం శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు.

  కేంద్ర సహాయ మంత్రిగా సాగర్‌

భారతీయ జనతా పార్టీ సైనికుడిగా ఎదిగిన సీహెచ్‌ విద్యాసాగర్‌రావు 1998-1999 ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూనే జాతీయ స్థాయిలో కరీంనగర్‌ వాణి వినిపించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. మెట్‌పల్లి శాసనసభ్యుడిగా, భాజపా శాసనసభా పక్ష నాయకుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని