logo

ఫోర్జరీ సంతకాలతో బిల్లులు.. కేసు నమోదు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ప్రధానోపాధ్యాయుడి సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు బిల్లులు సృష్టించిన జూనియర్‌ అసిస్టెంటు, ఆమె భర్తపై కేసు నమోదు అయింది.

Updated : 13 Apr 2024 05:29 IST

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ప్రధానోపాధ్యాయుడి సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు బిల్లులు సృష్టించిన జూనియర్‌ అసిస్టెంటు, ఆమె భర్తపై కేసు నమోదు అయింది. ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజభాను చంద్ర ప్రకాశ్‌ సంతకాలను అదే పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్న జి.తిరుమల, ఆమె భర్త కె.రాజ్‌కుమార్‌లు ఫోర్జరీ చేశారు. తప్పుడు బిల్లులను సృష్టించి ట్రెజరిలో సమర్పించడం, అకౌంటు నంబర్లు మార్చడం, ఉపాధ్యాయుల వేతనాల నుంచి అధిక చెల్లింపుల రికవరీ పేరిట ప్రధానోపాధ్యాయుడికి తెలియకుండా డబ్బులు వసూలు చేశారు. ఇటీవల గుర్తించిన ప్రధానోపాధ్యాయుడు ఎల్‌ఎండీ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  

కోర్టులో హాజరు..

 తిమ్మాపూర్‌: ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలను సృష్టించి అసలు భూ యజమానిని ఇబ్బందులకు గురి చేసిన ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని తిరిగి కోర్టులో హాజరుపర్చినట్లు ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు శుక్రవారం తెలిపారు. కరీంనగర్‌కు చెందిన కంది జ్యోతికి తిమ్మాపూర్‌ మండలంలోని నుస్తులాపూర్‌లో వ్యవసాయ భూమి ఉంది. కరీంనగర్‌ పాత బజార్‌కు చెందిన మంద గణేశ్‌.. ఆ భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి జ్యోతిని భూతగాదాలతో ఇబ్బందులకు గురి చేయగా గత నెలలో ఆమె ఎల్‌ఎండీ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గణేశ్‌ను విచారణ నిమిత్తం కరీంనగర్‌ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని తిరిగి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని