logo

మద్దతు వ్యూహం.. భవితకు అభయం

లోక్‌సభ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకుల మద్దతుపై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ఓట్లు రాబట్టాలంటే కచ్చితంగా సొంత పార్టీలో ప్రభావితం చేయగల నేతల సహకారం ఉండాలని భావిస్తున్నారు.

Updated : 13 Apr 2024 06:09 IST

 ద్వితీయ శ్రేణి నాయకులపై అభ్యర్థుల దృష్టి

ఈనాడు, కరీంనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకుల మద్దతుపై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ఓట్లు రాబట్టాలంటే కచ్చితంగా సొంత పార్టీలో ప్రభావితం చేయగల నేతల సహకారం ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సెగ్మెంట్ల వారీగా విశ్లేషించుకుంటూనే, పోలింగ్‌ కేంద్రాల వారీగా ముఖ్య నాయకుల తీరుపై దృష్టి సారిస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 5 నుంచి 10 మంది ముఖ్యుల పేర్లను నమోదు చేసుకుని వారితో అభ్యర్థులు నేరుగా మాట్లాడుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసానిస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీ వారిపైనా నజర్‌

ఇప్పుడిప్పుడే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో అక్కడక్కడ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో రంగులు మారే రాజకీయంలో తమదే పైచేయి కావాలని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం మొదట సొంత పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వారి ఆసక్తికి అనుగుణంగా నడుచుకుంటామని చెబుతూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని భరోసానిస్తున్నారు. అదే సమయంలో ఎదుటి పార్టీలో కీలకమైన నాయకులపైనా దృష్టి పెడుతున్నారు. తమ పార్టీలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుందంటూ రాయ‘బేరాలు’ సాగిస్తున్నారు. సొంత పక్షంలో అసంతృప్తిగా ఉంటూ కినుక వహించే వారిపై ప్రత్యేక ఆసక్తి చూపుతూ తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన చేస్తున్నారు.

ఎవరికి వారు భరోసా

  •  రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల్లో కీలక నాయకులను గుర్తించి నామినేటెడ్‌ సహా ప్రత్యక్ష ఎన్నికల్లో, పార్టీ పదవుల్లో అవకాశమిస్తామంటూ భరోసానిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో జోరు చూపిస్తోంది.
  •  నిజామాబాద్‌, కరీంనగర్‌లలో సిట్టింగ్‌ ఎంపీలున్న భాజపా కూడా ద్వితీయ శ్రేణి నాయకులను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్రంలో మరోసారి అధికారం ఖాయమని చెబుతూ పక్క పార్టీల కన్నా ఇక్కడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తోంది.
  •  భారాస కూడా ఉనికి కాపాడుకునే యత్నంలో రెండో స్థాయి నేతలకు అండగా ఉంటామని హామీ ఇస్తోంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి రాబోయే కాలంలో ప్రాధాన్యం ఉంటుందని చెబుతోంది.

    ‘జర ఈ ఎన్నికల్లో నాకు సహకరించండి. కచ్చితంగా మీ సేవలను గుర్తుంచుకుంటా. భవిష్యత్తులో పార్టీపరంగా ఎలాంటి అవకాశమున్నా మీకే ప్రాధాన్యమిచ్చేలా చూస్తాను. దయచేసి సంపూర్ణ మద్దతు అందించండి’.

-ద్వితీయ శ్రేణి నాయకుడికి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి విన్నపం.


‘ఎలాగైనా సరే.. ఈసారి ఆ గ్రామంలో మంచి పట్టున్న ఆ నాయకుడి సహకారం మనకే కావాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో అక్కడి పోలింగ్‌ బూత్‌లో మనకు మంచి ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ నాయకుడు మన వెన్నంటే ఉండాలి. ఇతర పార్టీల వైపునకు వెళ్లకుండా కాపాడుకోవాలి.’

-సొంత పార్టీ నాయకుడి మద్దతు కోసం మరో అభ్యర్థి యత్నం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని