logo

స్మార్ట్‌సిటీ తెచ్చిన ఘనత వినోద్‌కుమార్‌ది

ఉద్యమకాలం నుంచి నేటి వరకు భారాసకు కరీంనగర్‌ పుట్టినిల్లని, రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్‌ రాజీనామా చేసినా ఇక్కడి ప్రజలు ఆయన్ను గుండెలకు హత్తుకొని గెలిపించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. 

Updated : 13 Apr 2024 06:07 IST

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు 

మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఉద్యమకాలం నుంచి నేటి వరకు భారాసకు కరీంనగర్‌ పుట్టినిల్లని, రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్‌ రాజీనామా చేసినా ఇక్కడి ప్రజలు ఆయన్ను గుండెలకు హత్తుకొని గెలిపించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.  కరీంనగర్‌ రాంనగర్‌లో భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారాస కార్నర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీని, కరీంనగర్‌-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను, జాతీయ రహదారులను తీసుకొచ్చిన ఘనత వినోద్‌కుమార్‌ది అని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే ఎంపీ సంజయ్‌కుమార్‌ అయిదేళ్లలో సాధించింది ఏమి లేదన్నారు. పేదల కోసం కేంద్రం చేసింది చెప్పమంటే భాజపా వారు ఇంటికో చిత్రపటం, క్యాలెండర్లను పంచుతున్నారని తెలిపారు. అవి ఆకలి తీరుస్తాయా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 13 హామీల అమలుపై తాను, ఎమ్మెల్యే కమలాకర్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచాలంటే వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుకు తాను పోరాడగా, అయిదేళ్లలో ఎంపీగా సంజయ్‌ దాన్ని తీసుకురావడంలో విఫలమయ్యారని తెలిపారు. ఎంపీగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారని, ఎంపీ పదవి ఆయనకు పునరావాస కేంద్రమా? అని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే కరీంనగర్‌లో అంతర్జాతీయ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు. 330 ఎకరాల భూమిని కొండగట్టు ఆలయానికి తాము కేటాయిస్తే ఎంపీ సంజయ్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై.సునీల్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, భారాస జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, చల్లహరిశంకర్‌, డిప్యూటీ మేయర్‌ స్వరూపారాణి, భారాస కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు హరీశ్‌రావు మంకమ్మతోటలోని పాత లేబర్‌ అడ్డా నుంచి రాంనగర్‌ వరకు రోడ్‌షో నిర్వహించారు.

వినోద్‌కుమార్‌కే గెలుపు అవకాశాలు

రాంపూర్‌(కరీంనగర్‌) : పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాసకే అనుకూలంగా ఉందని, సర్వేలన్నీ కరీంనగర్‌ భారాస అభ్యర్థి  వినోద్‌కుమార్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో శుక్రవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు.

ర్యాలీలో పాల్గొన్న జనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని