logo

అనుమతి లేకుండానే వైద్య సేవలు

జిల్లాలో నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వైద్య సేవలందిస్తున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

Updated : 13 Apr 2024 06:04 IST

రాష్ట్ర వైద్య మండలి ఆదేశాలు బేఖాతరు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం : జిల్లాలో నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వైద్య సేవలందిస్తున్నా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్ర వైద్య మండలి స్పందించి నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకునే వారే లేరు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బృందాలు పలు దవాఖానాలు తనిఖీ చేశామని చెబుతున్నాయి. కానీ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడంలేదు.

అధికారుల బృందం పరిశీలించాక...

జిల్లాలో 400కు పైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, క్లినిక్‌లు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి పూర్తి స్థాయి అనుమతులు లేవు. జిల్లా వ్యాప్తంగా 40కి పైగా దవాఖానాలు అనుమతుల రెన్యూవల్‌ లేకుండానే నడిపిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన గల కమిటీ నుంచి శాశ్వత అనుమతి, రెన్యూవల్‌ పొందాలి. ఇప్పటికీ కొన్ని తాత్కాలిక అనుమతులతోనే పూర్తి స్థాయి సేవలు అందిస్తున్నాయి. సరైన భవనం, నిపుణులైన వైద్యులు, అర్హతగల సిబ్బంది, సదుపాయాలు ఉన్నాయా? లేదా అనేది అధికారుల బృందం పరిశీలించి నిర్ధారించాలి. ఆ తర్వాతే అనుమతి ఇవ్వాలి. కానీ ఈ తతంగం అంతా మొక్కుబడిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మొక్కుబడి తనిఖీలు..

కొన్ని ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదు. రోగ నిర్ధారణ కేంద్రాల్లో కొందరు అర్హులైన వైద్యులు లేకున్నా పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేస్తున్నారు. మెటర్నటి నర్సింగ్‌ హోంలలో ప్రసవాలకు తప్పనిసరి అయితేనే శస్త్రచికిత్సలు చేయాలనే నిబంధన ఉన్నా గాలికి వదిలేశారు. జిల్లాలో ఇప్పటికీ కొన్ని దవాఖానాలు పూర్తి స్థాయి అనుమతులు లేకున్నా కొనసాగుతున్నాయి. మొక్కుబడి తనిఖీలు కాకుండా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

 నిబంధనలు ఇలా..

ప్రతి ఆసుపత్రిలో బోర్డుపై రిజిస్ట్రేషన్‌ సంఖ్య, వైద్యుల పేర్లు, వారి వివరాలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. ఫీజుల వివరాలు కూడా తెలియజేయాలి. చీటీపై మందుల వివరాలు చదివే విధంగా రాయాలి. అవసరమైతేనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యులను డ్యూటీ డాక్టర్‌గా నియమించాలి. వెలుతురు, గాలి వచ్చే విధంగా కిటికీలు, వెంటిలేటర్లు ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల వైద్యులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాకే సేవలు మొదలుపెట్టాలి. ఆసుపత్రి నిర్వాహకుల వివరాలు కూడా తెలియజేయాలి.


నోటీసులు జారీ చేశాం..

జిల్లాలో కొన్ని ఆసుపత్రులకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చే దస్త్రం కలెక్టర్‌కు పంపిస్తున్నాం. పూర్తి వివరాలు లేని అయిదు రోగ నిర్ధారణ కేంద్రాలకు నోటీసులు జారీ చేశాం. తనిఖీలు కొనసాగిస్తాం. అధిక శస్త్రచికిత్సలు చేసిన 10 దవాఖానాలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ సుజాత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని