logo

తనిఖీలు లేవు.. తవ్వుకునుడే

మట్టి తవ్వకాలు చేపట్టాలంటే దానికి గనులశాఖకు రాయల్టీ చెల్లించి వేబిల్లులు పొందాలి. అంతకు ముందు అది ప్రభుత్వ, ప్రైవేటుదైనా రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. నీటి పారుదలశాఖ అయితే ఆ శాఖ అనుమతి కూడా తప్పనిసరి.

Published : 17 Apr 2024 05:20 IST

జలాశయంలో మట్టి దందా
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం

ట్టి తవ్వకాలు చేపట్టాలంటే దానికి గనులశాఖకు రాయల్టీ చెల్లించి వేబిల్లులు పొందాలి. అంతకు ముందు అది ప్రభుత్వ, ప్రైవేటుదైనా రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. నీటి పారుదలశాఖ అయితే ఆ శాఖ అనుమతి కూడా తప్పనిసరి. అనుమతిచ్చిన ప్రాంతంలో ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి అనేది గనులశాఖ అధికారులు పక్కాగా పరిశీలించాలి. కానీ ఇక్కడ అవేవీ ఉండవు. అంతా నోటి మాటలతోనే జరుగుతోంది. మధ్యమానేరు జలాశయంలో నీటి మట్టం తగ్గడంతో ముంపు గ్రామాలు తేలాయి. అక్రమార్కుల కన్ను ఆ ప్రాంతంపై పడింది. ఎఫ్‌టీఎల్‌ పరిధి దాటి జలాశయంలోకి చొరబడి యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. పక్కా ప్రణాళికతో మట్టి దందాను నడిపిస్తూ రోజుకు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఏ శాఖ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

వేములవాడ గ్రామీణ మండలం అనుపురం, రుద్రవరం శివారులోని మధ్యమానేరు జలాశయంలో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులంతా కూటమిగా మారి ఈ మట్టి దందాను కొనసాగిస్తున్నారు. దాదాపు పదిహేను రోజులుగా యంత్రాలతో వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వారు. ఇందులో మొరం లేఅవుట్లు, ప్రైవేటు నిర్మాణాలకు, నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. లారీ నల్లమట్టి రూ.6 వేలు, ట్రాక్టర్‌కు రూ.2,500 చొప్పున ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. ఒక ట్రిప్పు మొరం రూ.5 వేలు చొప్పున లారీల్లో తరలిస్తున్నారు. వీటిని సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. జలాశయంలో బయటపడిన ముంపు గ్రామం నుంచి మొరం, నల్లమట్టి తరలిస్తున్న వాహనాలతో అనుపురం, రుద్రవరంలోని దారులు దుమ్ముతో నిండిపోతున్నాయి. మొదట్లో గ్రామస్థులు వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు రోజులు ఆగిన తరవాత యథావిధిగా కొనసాగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. తనిఖీల్లో బయటపడకుండా ఉండేందుకు జలాశయంలో తవ్వకాలను రోజుకు ఒక చోటకు మార్చుతున్నారు.

ఎన్నికల విధుల్లో యంత్రాంగం

జలాశయంలో రెండు నెలలుగా నీటి మట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఆరు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడం, వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. దీనికితోడు అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండటంతో ఇటువైపు కన్నెత్తి చూసేవారు కరవయ్యారు. ఇదే అదనుగా అక్రమార్కులకు మట్టి కాసులు కురిపిస్తోంది.


అధికారులేమంటున్నారంటే...

జలాశయంలో మట్టి తవ్వకాలపై జలాశయం ఈఈ జగన్‌ను ‘ఈనాడు’ సంప్రదించగా మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. గనులశాఖ ఏడీ క్రాంతి కుమార్‌ స్పందిస్తూ ఎన్‌ఓసీ, వేబిల్లులను ఎవరికీ జారీ చేయలేదని పేర్కొన్నారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం ఇటీవలే మా దృష్టికి వచ్చిందన్నారు. ప్రాజెక్టు అధికారులను వెళ్లి పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీసుశాఖ సాయంతో తనిఖీలు చేపడతామని తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని