logo

స్వీయ జాగ్రత్తలతోనే మోసాలకు కళ్లెం

సైబర్‌ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారని.. స్వీయ జాగ్రత్తలతోనే వాటికి కళ్లెం వేయవచ్చని రామగుండం పోలీసు కమినరేట్‌ సైబô నేర విభాగం ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పలు అంశాలను ఆయన వివరించారు.

Published : 17 Apr 2024 05:25 IST

రామగుండం సైబర్‌ నేర విభాగం ఏసీపీ వెంకటరమణ
న్యూస్‌టుడే, గోదావరిఖని

సైబర్‌ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారని.. స్వీయ జాగ్రత్తలతోనే వాటికి కళ్లెం వేయవచ్చని రామగుండం పోలీసు కమినరేట్‌ సైబô నేర విభాగం ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పలు అంశాలను ఆయన వివరించారు.

ప్ర: బాధితులు నేరుగా ఫిర్యాదు చేయడం ఎలా?

స: ప్రతీ పోలీసుస్టేషన్‌లో సైబర్‌ వారియర్స్‌ ఉంటారు. సైబర్‌ నేరాలకు సంబంధించిన పూర్తి అవగాహన వారికి కల్పించాం. మోసపోయిన బాధితులు వారికి అందుబాటులో ఉన్న ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. సైబర్‌ వారియర్స్‌ ఫిర్యాదులను స్వీకరించి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. రూ.లక్ష లోపు మోసపోతే ఠాణాల పరిధిలోనే కేసులు నమోదు చేస్తారు. అంతకంటే ఎక్కువ మొత్తం మోసపోతే సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేస్తాం. ఫిర్యాదులపై సైబర్‌క్రైం విభాగం ద్వారానే విచారణ సాగుతుంది. పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి బాధితుడి వివరాలతో పాటు మోసగాడికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. నేరగాడి నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించి స్క్రీన్‌షాట్‌లు, ఇతర వివరాలు సైబర్‌క్రైం పోర్టల్‌కు తప్పనిసరిగా పంపించాలి.

ప్ర: ఏ రకమైన మోసాలు ఎక్కువగా నమోదవుతున్నాయి?

స: ముఖ్యంగా అయిదు రకాలుగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారం, పెట్టుబడుల పేరుతో ఇటీవలి కాలంలో ఎక్కువగా ఫోన్లు , సందేశాలు వస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెండింతల లాభం వస్తుందని ముందుగా ఉచ్చులోకి దింపుతున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు లాగుతున్నారు. పార్ట్‌టైం ఉద్యోగం అని.. ఇంట్లో ఉండి పనిచేయవచ్చని నమ్మిస్తూ ముందుగా ఎంతో కొంత డబ్బులు జమ చేయాలని మభ్యపెడుతున్నారు. క్రెడిట్‌కార్డు పేరుతో మరికొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ విధానంలో సైతం నేరగాళ్లు డబ్బులు డ్రా చేస్తున్నారు. మన అవసరాల కోసం ఎక్కడైనా వేలిముద్రలు వేస్తే వాటిని సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు వాటిని పోలిన విధంగా వేలిముద్రలు తయారు చేసి వివిధ ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. రుణాలు మంజూరు చేస్తామని చెప్పి దానికి డాక్యుమెంటు ఛార్జీలు, పన్నుల పేరుతో ముందుగా కొంత డబ్బులు చెల్లించాలని మోసానికి పాల్పడుతున్నారు. ప్రజలు ఈ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసాల గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్ర: ప్రజలకు మీరిచ్చే సూచన?

స: నేటికాలంలో ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించకూడదు. ఏటీఎం పిన్‌నెంబర్‌, మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దు. ఆయా అంశాలపై గ్రామాల్లో కళాజాత ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం.

ప్రశ్న : సైబర్‌ నేరాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు?

సమాధానం: ప్రజలు నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో సాధారణ నేరాల కంటే సైబర్‌క్రైం నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎక్కడో ఉండి మన నుంచి సమాచారం తెలుసుకుని డబ్బులు కొల్లగొట్టే ముఠాలు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన డబ్బులకు రక్షణ లేకుండా పోయే పరస్థితి ఏర్పడింది. ముందుగా ప్రజల్లో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని వెల్లడిస్తున్నాం. ఉద్యోగం.. చైన్‌లింకు వ్యాపారాల పేరుతో అనేక రకాలుగా మోసగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. వాటికి దూరంగా ఉండటం ద్వారా సైబర్‌ నేరగాళ్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

ప్ర: మోసపోయిన వారికి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందా?

స: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బు కోల్పోయిన వ్యక్తులు వెంటనే స్పందిస్తే వాటికి రక్షణ కల్పించవచ్చు. మోసపోయినట్లు గంటలోపు టోల్‌ఫ్రీ(1930) నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే వెంటనే నేరగాళ్ల డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్‌ చేయవచ్చు. నిమిషంలో సమాచారం ఇస్తే 90 శాతం వరకు డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత తొందరగా బాధితులు స్పందిస్తే వెంటనే అప్రమత్తమై డబ్బులు కాపాడేందుకు అవకాశం ఉంటుంది. టోల్‌ఫ్రీ నెంబరుతో పాటు www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో సైతం ఫిర్యాదు చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని