logo

మామిడి కొనుగోళ్లు ప్రారంభం

Published : 17 Apr 2024 05:27 IST

బహిరంగ వేలం చేపట్టిన వ్యాపారులు
న్యూస్‌టుడే- జగిత్యాల ధరూర్‌క్యాంపు

గిత్యాల చల్‌గల్‌ మామిడిమండీలో కాయల క్రయవిక్రయాలు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు కొనుగోళ్ల మధ్యవర్తిత్వానికిగాను రైతుల నుంచి కమీషన్‌ తీసుకున్నపుడు కాయలను బహిరంగ వేలం పద్ధతిన కొనుగోలు చేయాలి. కానీ దాదాపు 18 సంవత్సరాల్లో ఒకటిరెండుసార్లు మాత్రమే వేలానికి చర్యలు చేపట్టినా అమల్లోకి రాలేదు. యార్డులో సదుపాయాలు లేవన్న కారణంతో ట్రేడింగ్‌ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. కాగా ఈ సారి యార్డులో షెడ్లు, వాలంతరి నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలం అందుబాటులోకి రావడంతో తప్పనిసరిగా బహిరంగ వేలం పద్ధతిలోనే కాయలను కొనాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మామిడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఎం.డి.మొయిన్‌ వేలం పద్ధతిన కాయలను కొనగా బంగినపల్లి రకానికి టన్నుకు రూ.36 వేల నుంచి రూ.55 వేల వరకు ధర పలికింది. మిగిలిన వ్యాపారులు కూడా వేలం పద్ధతిని అనుసరించేలా డీఎంవో ప్రకాశ్‌ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్‌ పేర్కొన్నారు.

  • నాగ్‌పూర్‌ మార్కెట్లో ఉదయంపూట కాయలను వేలం వేస్తారు. కానీ చల్‌గల్‌ మండీకి రైతులు సాయంత్రం నుంచి రాత్రివరకు కాయలను తెస్తారు కాబట్టి రాత్రిపూట వేలాన్ని కొనసాగించేలా చూడాలి.
  • ఈ సీజన్‌లో పూత బాగావచ్చినా ప్రతికూల వాతావరణంతో కాయల దిగుబడి భారీగా తగ్గినట్లు రైతులు, తోటల గుత్తేదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిలకడైన ధరకు, రైతుల అవగాహనకు నాగ్‌పూర్‌, విజయవాడ, హైదరాబాద్‌, దిల్లీ తదితర మార్కెట్ల ధరలను చల్‌గల్‌మండీలో ప్రతిరోజూ ప్రదర్శించాలి.
  • యార్డువెలుపల కాయల క్రయవిక్రయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దు. కాయల గ్రేడింగ్‌, ప్యాకింగ్‌, లోడింగ్‌ పనులకు తరలివచ్చే వేలాది కార్మికులకు వసతులు కల్పించాల్సిఉంది. చల్‌గల్‌లోని రైపెనింగ్‌ ఛాంబర్‌ను అందుబాటులోకి తేవాలి.
  • ప్రభుత్వం ప్రకటించినట్లుగా జగిత్యాల బ్రాండ్‌ పేరిట కాయలను ఎగుమతి చేయాలి. మహిళా సంఘాలు, అపెడ, ఉద్యానశాఖల ద్వారా మామిడి కొనుగోళ్లను చేపట్టాలి. గతంలో మాదిరిగా జగిత్యాల నుంచి ఈ సీజన్‌లోనూ కిసాన్‌రైలు ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు కాయలను ఎగుమతి చేయాలి.
  • యార్డులోని ధర్మకాంటాలను రైతులకు అందుబాటులోకి తెచ్చి తూకంపక్కాగా జరిగేలా చూడాలి. ప్రతి కొనుగోలుపైనా మార్కెట్ఫీజును వసూలు చేయాలి. తరుగు, చిన్నకాయల పేరిట కోతలు విధించకుండా, సకాలంలో డబ్బులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
  • చల్‌గల్‌తో పాటుగా మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్‌ తదితర ప్రాంతాల్లోనూ కొందరు లైసెన్స్‌లేని వ్యాపారులు నేరుగా రైతులనుంచి మామిడిని కొంటుండగా వీరికి లైసెన్స్‌లు జారీచేసి యార్డులద్వారానే కొనుగోళ్లు జరిపేలా తక్‌పట్టీలు జారీచేసి క్రయవిక్రయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి.
  • సీజన్‌ ఆరంభంలో ధరలు బాగుంటున్నా స్థానికుల గుత్తాధిపత్యంతో ధరలు తగ్గించటం రివాజుగా ఉంటుండగా దిల్లీ, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన లైసెన్స్‌డ్‌ వ్యాపారులకూ కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తే పోటీపెరిగి ధరల్లో స్థిరత్వముండి రైతులకు లాభిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని