logo

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం

జగతికే ఆదర్శప్రాయుడు శ్రీరాముడ[ు.. కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా.. ఆదర్శ జీవనానికి ప్రమాణంగా చెప్పుకొనే సీతారాములు కల్యాణోత్సవం నిర్వహణకు జిల్లాలో ఆలయాలను ముస్తాబు చేశారు.

Published : 17 Apr 2024 05:42 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే:   జగతికే ఆదర్శప్రాయుడు శ్రీరాముడ[ు.. కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా.. ఆదర్శ జీవనానికి ప్రమాణంగా చెప్పుకొనే సీతారాములు కల్యాణోత్సవం నిర్వహణకు జిల్లాలో ఆలయాలను ముస్తాబు చేశారు. నగరంలోని సప్తగిరికాలనీ కోదండ రామాలయం, వావిలాలపల్లి, గాంధీరోడ్డు రామాలయాలు, వాసవి కన్యకాపరమేశ్వరీ, రాంనగర్‌ రమా సత్యనారాయణ, అభయాంజనేయ స్వామి, మహాశక్తి, గిద్దెపెరుమాండ్ల దేవస్థానం, హెలిప్యాడ్‌ మైదానం పక్కన ప్రసన్నాంజనేయ స్వామి, జడ్పీ క్వార్టర్‌ విద్యానగర్‌, మార్కెట్‌ రోడ్డు, మంకమ్మతోట వేంకటేటేశ్వరాలయాల్లో, పాతబజారు వీరాంజనేయ, యజ్ఞవరాహ స్వామి క్షేత్రం తదితర ఆలయాల్లో కల్యాణోత్సవాలు  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, షామియానాలు, ప్రత్యేక వేదికలు, కూలర్లు సమకూర్చుతున్నారు. నీటి వసతితోపాటు అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు. పుష్పమాలలు, మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో ఆలయాలను అలంకరించారు. కొన్ని ఆలయాల్లో మంగళవారం రాత్రి ఉత్సవమూర్తులను అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.

ఎదుర్కోలు ఉత్సవాలు...

కరీంనగర్‌ సాంస్కృతికం : శ్రీరామ నవమి సందర్భంగా కోదండ రామాలయం సీతారాములు కల్యాణ ఉత్సవమూర్తులకు మంగళవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో ఎదుర్కోలు ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మంత్రి దంపతులు స్వాగతం పలికి ఇంట్లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎదుర్కోలు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున రాజేందర్‌, ఆకారపు భాస్కర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కటకం వెంకటరమణ, అర్చకులు పాల్గొన్నారు.


ఇల్లందకుంట, జమ్మికుంట: ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ సిబ్బంది సమర్పించారు. బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుధాకర్‌ తెలిపారు. ఇల్లందకుంట, జమ్మికుంట రామాలయాల్లో బుధవారం నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం జమ్మికుంటలో ప్రధానార్చాకులు వెంకటాచారి ఆధ్వర్యంలో అంకురార్పణ హోమం, ధ్వజారోహణం చేశారు. గరుడ హోమం, రాత్రి స్వామివారి ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్‌ జె.ఇంద్రారెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు