logo

జన హితమే సుపరిపాలన మంత్రం

రాముడంటే నిలువెత్తు ధర్మానికి ప్రతీక.. అన్న వాల్మీకి మాటలు అక్షరాలా నిజం. రాముడు త్రేతాయుగం నాటి పాలకుడు. ధర్మం మూడు పాదాల మీద నడిచిన కాలమని ఆ యుగానికి పేరు. మానవీయ విలువలను శిఖరాయమాన స్థాయిలో సుప్రతిష్ఠితం చేసిన కాలమది.

Published : 17 Apr 2024 05:45 IST

శ్రీరాముడి మార్గం పాలకులకు అనుసరణీయం
ఈనాడు, కరీంనగర్‌

‘రామో విగ్రహవాన్‌ ధర్మ:’.. రాముడంటే నిలువెత్తు ధర్మానికి ప్రతీక.. అన్న వాల్మీకి మాటలు అక్షరాలా నిజం. రాముడు త్రేతాయుగం నాటి పాలకుడు. ధర్మం మూడు పాదాల మీద నడిచిన కాలమని ఆ యుగానికి పేరు. మానవీయ విలువలను శిఖరాయమాన స్థాయిలో సుప్రతిష్ఠితం చేసిన కాలమది. అందుకే నాటికి.. నేటికి .. ఏనాటికీ.. రామరాజ్యం రావాలని అంతటా కోరుకుంటారు. పాలన అంటే ఆయనదేనని కొండంతగా చెప్పుకొంటారు. పాలకుడంటే రాముడేనని.. రాజ్యపాలన అంటే ఆయన సాగించినదేనని కొనియాడతారు. ఏ ఎన్నికలొచ్చినా.. ప్రజల మనస్సులో రామరాజ్యం వంటి పాలన కావాలనే ఆకాంక్ష వినిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో మంచి నేతకు పట్టం కట్టాలని భావించే ఓటర్లు.. పాలకులు రాముడి మార్గాన్ని అనుసరించాలని భావిస్తారు. సీతారాముడి స్ఫూర్తిగా సుజన స్వామ్యానికి శ్రీరామరక్షను అందించాలని ఆకాంక్షిస్తారు. శ్రీరామచంద్రుడి భావాలని కొన్నింటినైనా అందిపుచ్చుకొని సుపరిపాలన అందించాలని కోరుకుంటారు..

ఆర్తుల గోడు వినాలి

తన పాలనలో ప్రజలకు అందుతున్న సేవలపై శ్రీరాముడు వేగుల ద్వారా సమాచారాన్ని సేకరించేవారు. జనాల అవసరాలకు తగినట్లుగా వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చేవారు. నేటి పాలకులు ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా పాలకులకు, అధికారులకు తమ గోడు వినిపిస్తున్నా కొన్నింటిని పట్టించుకొని, మరికొన్నింటిని వదిలేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావాణికి సగటున 850కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటన్నింటి పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో గెలవబోయే ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి బాధితుల వ్యథను తీర్చడం ద్వారా సుపరిపాలన అందించాల్సి ఉంది.

ధనప్రీతి లేకపోవడమే రాజనీతి

రావణుడిపై గెలుపు అనంతరం లంక కోటను పరిశీలించిన శ్రీరాముడికి అక్కడ వజ్ర వైఢూర్యాలు కనిపించినా ఏ మాత్రం ఆసక్తి చూపకుండా వెనక్కి వచ్చేశారు. ఈ క్రమంలోనే సీతతో పాటు లక్ష్మణుడికి  ఉద్దేశం వెల్లడించారు. ‘అక్కడున్నవి ఏవీ మనవి కావు.. మనవి కాని వాటిపై మనకు హక్కు ఉండకూడదు.. అంతకన్నా మిక్కిలి ధనప్రీతి అస్సలు ఉండకూడదు..’ అని చెప్పి అయోధ్యకు పయనమయ్యారట. నేటి నాయకుల్లో ఈ లక్షణం తక్కువే. రాజకీయాల్లోకి వచ్చే వారిలో సేవా గుణం కన్నా సంపాదనపై దృష్టి పెడుతున్నవారే అధికం. సీతారాముడిని ఆదర్శంగా తీసుకుని స్వార్థ ప్రయోజనాలకు దూరంగా ఉండాలి. రాజకీయాలంటే సేవ అనే విషయం గుర్తుంచుకోవాలి. అవినీతి రహిత పాలన అందిస్తూ, కమీషన్లు, వాటాల జోలికి వెళ్లకుండా ప్రజాధనం సద్వినియోగమయ్యేలా చూడాలి.

రైతు సంక్షేమంతోనే సుభిక్షం

సస్య వృద్ధి, పశు వృద్ధితో అంతా సుభిక్షమనే తీరు రాముడి రాజ్యంలో ఉండేది. రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించేవి. జలవనరులను భద్రంగా కాపాడే వ్యవస్థ ఉండేది. రైతులు అన్ని రుతువుల్లో ఆనందంగా ఉండేవారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 6.86 లక్షల అన్నదాతల కుటుంబాలకు ఆరుగాలం కష్టాలే ఎదురవుతున్నాయి. అకాల వర్షాలతో చేతికందే పంట దూరమై దుఃఖాన్ని మిగులుస్తుంది. శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు మృగ్యమవుతోంది. ధీమానివ్వాల్సిన బీమా పథకాలు అందడం లేదు. ఈ తీరులో మార్పు రావాలి. రైతు శ్రేయస్సుకు పాటుపడేలా సాగు లాభదాయంగా మారాలి. కొత్త పరిశోధనలు, కొత్త వంగడాల సృష్టికి జిల్లా వేదికయ్యేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు త్వరలో గెలిచే ఎంపీలు ఇందుకు సంపూర్ణ తోడ్పాటు అందించాలి.

నమ్మిన వారికి కొండంత అండ

విభీషణుడు రాముడి వద్దకు వచ్చినప్పుడు సుగ్రీవుడు తదితరులు వ్యతిరేకించినా అలాంటి అనుమానాలు వద్దని, నమ్మి వచ్చిన వారిని చేరదీయాలని చెబుతారు. సముద్రంలో వారధి నిర్మాణ సమయంలో రావణుడితో గెలిచి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని మాటిచ్చిన శ్రీరాముడు ఆ మాటను నిలబెట్టుకుంటారు. రామవాక్కు అంటే ఇప్పటికీ ప్రజలకు ఎనలేని నమ్మకం.. నేటి నాయకులు ప్రజలకు హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని నెరవేర్చి వారి ఆకాంక్షలు తీర్చాలి. సాగు, తాగునీటి ఇబ్బందులు తగ్గించేలా చర్యలు తీసుకోవడంతోపాటు మౌలిక వసతులు కల్పించాలి.


సమ న్యాయమే ధర్మ మార్గం

కౌసల్య తనయుడి పాలనలో అందరికీ ఒకటే న్యాయం. అది పేదలకైనా.. పెద్దలకైనా.. చివరికి రాజుకైనా. ప్రజల మాటే తన బాటగా ముందుకు సాగిన రాముడిని నేటి నేతలు ఆదర్శంగా తీసుకోవాలి. బంధుప్రీతి, అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చూపిస్తున్న ఆరాటాన్ని తగ్గించాలి. అర్హులైన వారికి పథకాలు, సంక్షేమ ఫలాల లబ్ధి అందాలి. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా పథకాల్లో ఇష్టారాజ్యమనే పంథా కనిపించింది. అనర్హులకు పెద్దపీట వేసిన తీరు ఇక మీదనైనా మారాలి. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలి. ఉమ్మడి జిల్లాలో సగటున రోజుకు 20కి పైగా కేసులు నమోదవుతున్న తీరుతో పాటు మహిళలపై అఘాయిత్యాలు తగ్గేలా పాలకులు చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని