logo

కష్టపడ్డారు.. సివిల్స్‌లో మెరిశారు!

కరీంనగర్‌ ఖ్యాతిని నిలబెట్టే విధంగా మరో ఇద్దరు సివిల్స్‌ విజేతలుగా నిలిచారు. పట్టుదలతో రాణించి ప్రతిభతో మెరిశారు.  తండ్రి చనిపోయినప్పటికీ.. బీడీ కార్మికురాలైన తల్లి కష్టం వృథా కావొద్దని కష్టపడిన సాయికిరణ్‌ 27వ ర్యాంకుని సాధించగా.. అమ్మానాన్నల కష్టాన్ని కళ్లారా చూసిన కరీంనగర్‌కు చెందిన మరో యువతి సహన 739వ ర్యాంకు అందుకున్నారు..ఇద్దరూ యువతకు ఆదర్శంగా నిలిచారు.

Published : 17 Apr 2024 05:51 IST

ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం

కరీంనగర్‌ ఖ్యాతిని నిలబెట్టే విధంగా మరో ఇద్దరు సివిల్స్‌ విజేతలుగా నిలిచారు. పట్టుదలతో రాణించి ప్రతిభతో మెరిశారు.  తండ్రి చనిపోయినప్పటికీ.. బీడీ కార్మికురాలైన తల్లి కష్టం వృథా కావొద్దని కష్టపడిన సాయికిరణ్‌ 27వ ర్యాంకుని సాధించగా.. అమ్మానాన్నల కష్టాన్ని కళ్లారా చూసిన కరీంనగర్‌కు చెందిన మరో యువతి సహన 739వ ర్యాంకు అందుకున్నారు..ఇద్దరూ యువతకు ఆదర్శంగా నిలిచారు. వారి సంతోషాన్ని.. లక్ష్యం సాధించిన తీరును ‘ఈనాడు’తో పంచుకున్నారు.

నా లక్ష్యం ముందు పేదరికం చిన్నది!

-సాయికిరణ్‌, సివిల్స్‌ 27వ ర్యాంకు

మాది చాలా పేద కుటుంబం. రామడుగు మండలం వెలిచాల స్వగ్రామం. ప్రస్తుతం కరీంనగర్‌లో ఉంటున్నాం. అమ్మ లక్ష్మి ఇప్పటికీ బీడీలు చుడుతోంది. అక్క స్రవంతికి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం కళ్లారా చూశాం. అక్క చదువుతున్న తీరుని చూసి.. నేను కూడా బాగా చదివి సమాజంలో మంచి పేరుని సంపాదించాలనుకున్నా. దురదృష్టవశాత్తు నాన్న కాంతారావు 2016లో చనిపోయారు. దీంతో కుటుంబ బాధ్యత అమ్మపై పడింది. బీడీలు చుడుతూ మమ్మల్ని చదివించగా అక్కా, నేను కష్టపడి చదువుకున్నాం. అక్క స్రవంతి విద్యుత్తు శాఖలో ఏఈగా ప్రస్తుతం బోయినపల్లిలో పనిచేస్తోంది. అమ్మ తన కష్టాన్ని ఏనాడూ మాకు చెప్పేది కాదు. పేదరికం ప్రతిసారి నన్ను వెక్కిరించినప్పటికీ నేను నిర్ణయించుకున్న లక్ష్యం ముందు అది చిన్నదిగా కనిపించింది. అందుకే పట్టుదలతో చదివి నేనేంటనేది లోకానికి చూపించాలనుకున్నా. సాదాసీదా లక్ష్యం కన్నా.. ఐఏఎస్‌ కావాలనే సంకల్పాన్ని నాలో అణువణువునా నింపుకొన్నా.


ఐఏఎస్‌ సాధించడమే ఆశయం

-కొలనుపాక సహన, 739 ర్యాంకు

నాలుగో ప్రయత్నంలో 739 ర్యాంకు సాధించిన నేను ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమవుతాను.  నాకు చిన్నప్పటి నుంచే కలెక్టరుగా ప్రజలకు సేవలందించాలనే లక్ష్యం ఉండేది. అప్పట్లో కరీంనగర్‌ కలెక్టరుగా పనిచేసిన స్మితా సభర్వాల్‌ని చూసి నేను అలాగే అవాలనుకున్నా. అమ్మ గీత, నాన్న అనిల్‌ జయశంకర్‌ మద్దతివ్వడంతో ఈ రోజు ఈ ర్యాంకు సాధించగలిగా.


30 నిమిషాల ముఖాముఖి

దాదాపు 30 నిమిషాల పాటు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భారత దేశం నుంచి ఇతర దేశాలకు ప్రతిభ కలిగిన యువత ఎందుకు వెళ్తున్నారనే కోణంలో పలు ప్రశ్నలు అడిగారు. నేను ఇచ్చిన సమాధానాలు వారికి నచ్చాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలి? సుపరిపాలనలో ఉండాల్సిన లక్షణాలు.. ఇలా చాలా ప్రశ్నలు సంధించారు. నేను ప్రతి దానికి నాకున్న అనుభవం, ఆలోచనతో సమాధానాలివ్వడంతో ఈ రోజు ఇలా మీ ముందు విజేతగా నిలబడ్డా.


ఏకాగ్రతే ముఖ్యం..

ఎన్ని గంటలు చదివాననే దానికన్నా.. చదివినంత సేపు ఎంత ఏకాగ్రతతో చదివావమన్నదే విజయమంత్రం. ఐఏఎస్‌ అనేది కొందరికే దక్కుతుందనేది అపోహ. కోచింగ్‌లు తీసుకుని గంటల తరబడి చదివితేనే ఇది సొంతమనే భావనను నా శ్రమతో పటాపంచలు చేశా. నిట్‌ వరంగల్‌లో బీటెక్‌ చేస్తున్న సమయంలోనే నాకు ప్రాంగణ ఎంపికలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగమొచ్చింది. అమ్మను కష్టపెట్టడం ఇష్టం లేక ఉద్యోగం చేస్తూనే మూడేళ్ల నుంచి సివిల్స్‌కు సిద్ధమయ్యాను. గతేడాది ముఖాముఖి వరకు వెళ్లి విఫలమవడంతో ఈసారి మాక్‌ ఇంటర్వ్యూలపై శిక్షణ తీసుకున్నా. శని, ఆదివారాల్లో సెలవు ఉండటంతో వీలైనంత ఎక్కువగా చదివే వాడిని. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం నాకు వరంగా మారింది. అందుకనే ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండానే రెండో ప్రయత్నంలో 27వ ర్యాంకుని సాధించా.


పలువురు అధికారుల స్ఫూర్తితో..

జయప్రకాశ్‌ నారాయణతోపాటు పలువురు ఐఏఎస్‌ అధికారుల పనితీరు, వారికి సేవపై ఉన్న మక్కువ నన్ను సివిల్స్‌ దిశగా నడిపించింది. మొదట్లో ఏదో ఒక మంచి ఉద్యోగం చాలనుకున్న నేను.. తరవాత సివిల్స్‌ నా లక్ష్యమని నిర్ణయించుకున్నా. తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడ్డా. పెద్ద లక్ష్యమని తెలిసినప్పటికీ సాధించాలనే తపన ఉంటే సాధ్యం కానిదేదీ ఉండదనేది నా నమ్మకం. అందుకనే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లా. సోషియాలజీ ఆప్షన్‌తో సన్నద్ధమయ్యా.


పట్టుదల.. ప్రణాళిక

సివిల్స్‌ సాధించాలంటే ఉండాల్సింది సాధించాలన్న పట్టుదల.. అందుకు పక్కా ప్రణాళిక. జిల్లా యువతకు నేను సూచించేదిదే. లక్ష్యం నిర్ణయించుకుంటే సరిపోదు.. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే అనుసరించాల్సిన విధానాలపైనా స్పష్టత ఉండాలి.


విద్యాభ్యాసం నుంచి సివిల్స్‌ ర్యాంకు వరకు..

రీంనగర్‌లోని కెన్‌క్రెస్ట్‌ స్కూల్‌లో 9.8 జీపీఏతో పదో తరగతి పాసయ్యా. ఇంటర్మీడియట్‌ శ్రీ గాయత్రి జూనియర్‌ కళాశాలలో చదివి 979 మార్కులు పొందా. 2019లో హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశా. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదవడం వల్ల సివిల్స్‌ శిక్షణలో ఆంత్రోపాలజీ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుని దిల్లీలో కోచింగ్‌ తీసుకున్నా. 2020లో అక్కడే ఉండి శిక్షణ తీసుకున్నా. మొదటి సారి అర్హత సాధించలేదు. 2021, 2022లో ప్రాథమిక పరీక్షలో అర్హత పొందినా.. తుది పరీక్ష వరకు వెళ్లలేదు. 2023లో కష్టపడి చదివి ఈ ర్యాంకును సాధించగలిగా.


రేయింబవళ్లు కష్టపడి చదివా..

లాగైనా సివిల్స్‌లో సత్తా చాటాలి. మంచి మార్కులతో నా ప్రతిభను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో రేయింబవళ్లు కష్టపడి చదివా. తెలిసిన విషయాలకన్నా.. తెలియని విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టా. రోజులో 18 గంటల పాటు చదివి వివిధ అంశాలపై పట్టు పెంచుకున్నా. చదువే నా లోకంగా మారింది. మధ్యలో ఎల్‌అండ్‌టిలో ఉద్యోగం వచ్చినా నా లక్ష్యాన్ని వదల్లేదు. సివిల్స్‌ సాధనలో పలుమార్లు విఫలమైనప్పటికీ నా తల్లిదండ్రులు నన్ను నిరుత్సాహపరచలేదు. వారి ప్రోత్సాహం నాలో తపనను మరింత పెంచింది. దీంతో మరింత శ్రమించా. ప్రతి ఏడాది కొంత మెరుగయ్యా. భవిష్యత్తులోనూ కచ్చితంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో చదువుతా. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్‌నై ప్రజలకు సేవనందిస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు