logo

కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?

కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది.

Published : 20 Apr 2024 04:41 IST

తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయని సిబ్బంది

పంచాయతీకి ఇచ్చిన నీటి పరీక్ష కిట్టు

న్యూస్‌టుడే, ముస్తాబాద్‌: కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. దీంతో తాగునీటి పరీక్షలు చేసేందుకు పంచాయతీలకు కిట్లను అందించింది. గ్రామ కార్యదర్శుల పర్యవేక్షణలో పంపు ఆపరేటర్లు ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి ప్రజలకు శుద్ధ జలం అందించేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో మాత్రం కిట్లను ఉపయోగించిన దాఖలాలు లేవు. మరోవైపు ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయని పరిస్థితి ఉంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 592 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు ఉండగా 287 మంది పంపు ఆపరేటర్లు ఉన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు నీటి నాణ్యత పరీక్షల కిట్లను సంబంధిత అధికారులు అందించారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లో 10 వేల లీటర్లకు 40 గ్రాముల చొప్పున బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి క్లోరినేషన్‌ చేయాలని గ్రామ కార్యదర్శులతోపాటు పంపు ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. అలాగే నీటి నాణ్యత కిట్లు అందించి వాటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. 5 గ్రాముల నీటిని తీసుకొని అందులో ఆర్థో టోలుయిడిన్‌ ఒక చుక్క కలపగానే రంగు వస్తుంది. ట్యాంకు వద్ద 2 పీపీఎం (పాస్పర్‌ మిలియన్‌), మధ్యలో ఒక పీపీఎం, నల్లాల వద్ద 0.2 నుంచి 0.5 వరకు పీపీఎం ఉండాలని నీటి నాణ్యత పరిశీలకుడు రాజిరెడ్డి అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో మాత్రం ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల్లో నీటి నాణ్యత పరీక్షలు చేసిన దాఖలాలు లేవు. పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో ట్యాంకులను శుభ్రం చేసి నీటి పరీక్షలు చేయాల్సి ఉన్నా పట్టించుకున్న నాథుడు లేడు. వయోభారం కారణంగా పంపు ఆపరేటర్లు ట్యాంకులను ఎక్కలేకపోతున్నారు. దీంతో వారు శుభ్రం చేయడం లేదు. కూలీలకు ఏర్పాటు చేసి చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్‌ భగీరథ నీటిని తరచూ పరీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తాగడానికి పనికి వస్తుందా, లేదా అనేది పరీక్షల ద్వారా స్పష్టత వస్తుంది. పరీక్షల్లో నాణ్యత లేదని గుర్తిస్తే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. ప్రజలకు శుద్ధజలం సరఫరా అయ్యేలా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఎప్పటికప్పుడు చేయాలి

ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు ఇప్పటికే మిషన్‌ భగీరథ నీటిని అందిస్తోంది. శుద్ధజలం సరఫరా అవుతున్న క్రమంలో అక్కడక్కడ పైపుల లీకేజీతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. అవి ట్యాంకుల్లో చేరి ఇళ్లకు సరఫరా జరిగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారం శుభ్రం చేయించి క్లోరినేషన్‌ చేసేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి. ప్రభుత్వం అందించిన నీటి నాణ్యత కిట్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేసి ప్రజలకు శుద్ధజలం అందించాలి.

కాంపెల్లి శ్రీనివాస్‌, చీకోడ్‌ మాజీ సర్పంచి

శిక్షణ ఇచ్చాం

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు నీటి నాణ్యత పరీక్షల కిట్లు అందజేశాం. నీటి పరీక్షలపై కార్యదర్శులు, పంపు ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. మిషన్‌ భగీరథ శుద్ధజలాన్ని సరఫరా చేస్తున్నాం. అక్కడక్కడ పైపుల లీకేజీ ద్వారా నీరు కలుషితమై సరఫరా అయ్యే అవకాశం ఉంది. అందుకు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులో పరీక్షలు చేయాలని సూచిస్తున్నాం. పరీక్షలు చేయడం లేదని మా దృష్టికి వస్తే సంబంధిత కార్యదర్శుల పర్యవేక్షణలో పంపు ఆపరేటర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు నీటి నాణ్యత పరీక్షలు చేయాలని ఆదేశిస్తున్నాం.

ప్రేమ్‌చందర్‌, డీఈ, మిషన్‌ భగీరథ ఇంట్రా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు