logo

పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు

రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు.

Published : 24 Apr 2024 05:18 IST

 ఓడేడ్‌ వంతెన నిర్మాణంలో అంతులేని జాప్యం 

వంతెన పక్క నుంచి తాత్కాలిక రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాలు

ఈనాడు, పెద్దపల్లి-న్యూస్‌టుడే, మంథని, ముత్తారం: రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. ఎనిమిదేళ్లయినా అతీగతీ లేకపోగా పనుల్లో నాణ్యత లోపాలు బయటపడుతుండటంతో నిరాశే మిగిలింది.

ముత్తారం మండలం ఓడేడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మించతలపెట్టిన వంతెనకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పనులు ప్రారంభించిన రెండేళ్లకు ప్రధాన గుత్తేదారు చేతులెత్తేయగా, ఉప గుత్తేదారుకు చెందిన యంత్రాలు, సామగ్రి వరదలకు కొట్టుకుపోవడంతో ఆయన కూడా వదిలేశారు. దీంతో వారధి పనులు అసంపూర్తిగా మిగిలాయి. మరోవైపు ఓడేడ్‌ వంతెనకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.21.46 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణాలు కొట్టుకుపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచాయి.

నాణ్యత లోపం లేదు: డీఈఈ

వంతెన గడ్డర్లు వాగులో వేసిన తాత్కాలిక రహదారిపై పడటంతో రెండు జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఓడేడ్‌ వంతెన నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం లేదని, ప్రకృతి వైపరీత్యం వల్లే గడ్డర్లు కూలిపోయాయని ఆర్‌అండ్‌బీ డీఈఈ ఇమానొద్దీన్‌ జాఫర్‌ తెలిపారు. రివైజ్‌డ్‌ అంచనాలు రూపొందించి తిరిగి టెండర్లు పిలవాల్సి ఉంటుందని, గుత్తేదారుకు బదులుగా ఏజెన్సీకి పని అప్పగిస్తే ఏడాదిలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.

విచారణ చేయమని సీఎంను కోరా: మంత్రి

ఓడేడ్‌ వద్ద వంతెన గడ్డర్లు కూలిన ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు మంత్రి శ్రీధర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల ఉల్లంఘన, గుత్తేదారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.

రూ.75 లక్షల వరకు నష్టం

మానేరుపై ఓడేడ్‌-గర్మిళ్లపల్లితో పాటు ఖమ్మంపల్లి-తాడిచెర్ల వంతెనల నిర్మాణం ఒకేసారి చేపట్టారు. ఇక్కడ పనులు ఏళ్ల తరబడి సా..గుతుండగా ఖమ్మంపల్లి వద్ద నిర్మాణం పనులు పూర్తయి, వంతెన మీదుగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఓడేడ్‌ వద్ద పనులు అసంపూర్తిగా నిలవడంతో రెండు జిల్లాల మధ్య వర్షాకాలంలో రవాణా సౌకర్యాలు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా వంతెనకు చెందిన మూడు గడ్డర్లు కూలిపోవడంతో దాదాపు రూ.75 లక్షల నష్టం వాటిల్లింది. ఎనిమిదేళ్ల కిందట పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 23 పియర్లు, 13 బీములు నిర్మించారు. మరో 11 బీముల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ.22 కోట్ల వరకు పనులు చేయగా గుత్తేదారుకు రూ.18 కోట్ల వరకు చెల్లించారు. గుత్తేదారుకు పొడిగించిన అదనపు గడువు కూడా పూర్తి కావడంతో కాంట్రాక్టు రద్దు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని