logo

ఆయుధాలు అప్పగించారు..

వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు.

Published : 24 Apr 2024 05:26 IST

ఠాణాలకు చేరిన లైసెన్సుడ్‌ తుపాకీలు 

న్యూస్‌టుడే, గోదావరిఖని : వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయుధాలను అప్పగించాలని పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు వంద శాతం డిపాజిట్‌ చేశారు. ఆయధాల చట్టం 1959 సెక్షన్‌ 21 ప్రకారం వ్యక్తిగత తుపాకీ లైసెన్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని ఠాణాల్లో ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో ఈ నిబంధన అమలులో ఉంది.

నిబంధనలు వర్తిస్తాయి

 ఉమ్మడి జిల్లాలో మొత్తం 263 లైసెన్సుడ్‌ ఆయుధాలున్నాయి. ఇందులో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న 201 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు ఠాణాల్లో అప్పగించారు. మిగతా 62 ఆయుధాలను వివిధ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల భద్రత కోసం వినియోగిస్తున్నారు. అప్పగించిన ఆయుధాలను లైసెన్సుదారులు జూన్‌ 7న తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

  •  ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికే లైసెన్సు కలిగిన ఆయుధాలను అప్పగించాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆలోపే పోలీసు శాఖ నుంచి వెళ్లిన సమాచారం మేరకు లైసెన్సుదారులు తమ పరిధిలోని ఠాణాలకు అప్పగించారు.
  •  వ్యక్తిగత భద్రత కోసం ఎవరైనా ఆయుధాలు పొందే అవకాశం ఉంది. 1959 చట్టం ప్రకారం తుపాకీ లైసెన్సు కావాలనుకునే వారు ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అతడికి ప్రాణ హాని ఉందా? అన్న విషయాన్ని ఆ ప్రాంత ఠాణా పరిధి పోలీసులు పరిశీలిస్తారు. ఆ వివరాలను సీఐ, డీఎస్పీ, ఎస్పీలకు నివేదిస్తారు. ఈ మేరకు కలెక్టర్‌ లైసెన్సు మంజూరు చేస్తారు.
  •  సాధారణంగా రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు, గుత్తేదారులు ఎక్కువగా ఆయుధ లైసెన్సులు తీసుకుంటారు. కేవలం ఆత్మరక్షణ కోసమే వీటిని వినియోగించాలి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఇతరులను బెదిరించడానికి ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
  •  లైసెన్సు పొందిన వ్యక్తులు నాన్‌ ప్రొహిబిటెడ్‌ బోర్‌(ఎన్‌పీబీ) తుపాకులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఎన్నికల సమయంలో తప్పకుండా ఠాణాల్లో అప్పగించాలి.

     

శాంతిభద్రతలకు భంగం వాటిల్లకూడదనే..

ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది. శాంతిభద్రతలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ మేరకు ఆదేశిస్తాం. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే భద్రతా సిబ్బంది, గార్డు విధులు నిర్వహించే వారికి మినహాయింపు ఉంటుంది.

-ఎం.శ్రీనివాస్‌, రామగుండం సీపీ‘


ఒక జిల్లా.. ముగ్గురు ఎంపీలు

జగిత్యాల జిల్లా మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. మొత్తం 20 మండలాలు,  5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో, చొప్పదండి సెగ్మెంట్‌లోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాలు కరీంనగర్‌ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఇక ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. -

న్యూస్‌టుడే, రాయికల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని