logo

ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లు కుమ్మక్కు: కేటీఆర్‌

ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు  కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 04:14 IST

గోపాల్‌రావుపల్లెలో సిద్దోగానికి హాజరైన  కేటీఆర్‌

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు  కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో క్లస్టర్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. భారాసకు ప్రజల్లో ఆదరణ ఉందని, స్వార్థ నాయకులే పార్టీని వీడుతున్నారన్నారు. పోయినవారి గురించి బాధపడేది లేదని, గ్రామీణ స్థాయిలో చురుకైన కార్యకర్తలను తయారు చేస్తామన్నారు. అధికారం వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా  ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ చీకటి దోస్తులని, బండి సంజయ్‌ను గెలిపించేందుకు ప్రజలకు తెలియని అభ్యర్థిని కాంగ్రెస్‌ పోటీలో పెట్టిందని ఆరోపించారు. భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో మీకు నేను అండగా ఉంటానని హామీనిచ్చారు. మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జీవితంపై మోయలేని భారం పడిందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి పేరుతో పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు పన్ను వేసి రూ.3 వేల కోట్లు వసూలు చేశారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తరన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాస అధినేత కేసీఆర్‌ మే 10న సిరిసిల్లకు వస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన నాయకులే కష్ట కాలంలో కేసీఆర్‌ను వీడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్‌ తెలంగాణ ప్రజల కోసం మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారన్నారు. ప్రచార సభకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు పెద్దూరు, గోపాల్‌రావుపల్లెలో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరయ్యారు. సమావేశంలో భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల క్లస్టర్‌ స్థాయి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని