logo

జూన్‌ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు

జూన్‌ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 04:19 IST

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

కమాన్‌పూర్‌, న్యూస్‌టుడే : జూన్‌ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కమాన్‌పూర్‌లో భారాస పార్టీ మండలాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు ఇంతియాజ్‌, రైతుబంధు కన్వీనర్‌ కృష్ణమూర్తి, మాజీ సింగిల్‌విండో ఛైర్మన్‌ రాజేందర్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌, గుండారం, కమాన్‌పూర్‌ గ్రామశాఖల అధ్యక్షులు కిషన్‌, రాజయ్యతో పాటు నాయకులు, మహిళలు బుధవారం కాంగ్రెస్‌లో చేరగా మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే భారాస నాయకత్వం ‘కూలుతూనే ఉంటాయి.. నడుస్తూనే ఉంటా’యని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కమీషన్లు తీసుకొని నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో బ్యారేజీలు నాసిరకంగా మారి కూలుతున్నాయని ఆరోపించారు. ముత్తారం మండలం ఓడేడ్‌ వంతెన గాలిదుమారానికే కూలిపోయిందన్నారు. దీనిపై విచారణ జరిపి కారకులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు.  గత ప్రభుత్వం కమాన్‌పూర్‌ను మూడు ముక్కులు చేసి మండల ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో నాలుగు కిలోలు తరుగు పేరిట కోత విధించారని, కాంగ్రెస్‌ హయాంలో కోతలు లేకుండా కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. సాగునీటి విషయంలో ఇబ్బందికర పరిస్థితులున్నా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి సాగునీటిని అందించామని చెప్పారు. మంగపేట దారిలో కల్వర్టును నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతియాదవ్‌, మండల అధ్యక్షుడు రాజు, సింగిల్‌విండో ఛైర్మన్‌ భాస్కర్‌రావు, రామగిరి, మంథని మండల ఎంపీపీలు దేవక్క, శంకర్‌, మాజీ ఎంపీపీ మారుతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు