logo

కాంగ్రెస్‌తో భారాస నేతల కుమ్మక్కు

కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 25 Apr 2024 04:30 IST

భాజపా జాతీయ ప్రధాన  కార్యదర్శి బండి సంజయ్‌

పార్టీలో చేరిన యువకులతో సంజయ్‌

చొప్పదండి, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. చొప్పదండిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కరీంనగర్‌కు చెందిన స్థానిక నేత ఆ పార్టీ హైకమాండ్‌కు చెప్పకుండా ఇష్టానుసారంగా వెలిచాల రాజేందర్‌రావుతో నామినేషన్‌ వేయించారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గరమయ్యారు. అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కూడా నామినేషన్‌ వేస్తుండడంతో ఆ పార్టీ నాయకులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహిళలకు రూ.2500, పింఛన్‌దారులకు రూ.4 వేలు, ఇల్లు లేని వారికి స్థలంతోపాటు రూ.5 లక్షలు, రైతు భరోసాలో భాగంగా రూ.15 వేలు, ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇలా అమలు కానీ హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అనంతరం స్థానిక భారాస యువజన అధ్యక్షుడు మంద శ్రీరామ్‌ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలువురిని పార్టీకి ఆహ్వానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్లమెంట్‌ కన్వీనర్‌ బి.ప్రవీణ్‌రావు, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్‌ శ్రవణ్‌, అసెంబ్లీ ప్రబరి రాజేశ్‌, మండల అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్‌ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : మానకొండూరు, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల నుంచి పలువురు భారాస, కాంగ్రెస్‌ నాయకులు బుధవారం కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయంలో భాజపాలో చేరారు. వారికి ఎంపీ బండి సంజయ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేములవాడ రూరల్‌ మండల ఎంపీపీ బండ మల్లేశం యాదవ్‌, శంకరపట్నం మండలంలోని భారాసకు చెందిన లింగాపూర్‌, మెట్‌పల్లి ఎంపీటీసీ సభ్యులు అంతం లత, కొయ్యడ శోభరాణి, నాయకులు భాజపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని