logo

రాజేందర్‌రావు చేతికే టికెట్‌

రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్‌ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్‌రావుకు అవకాశమిచ్చింది.

Published : 25 Apr 2024 04:32 IST

ఎట్టకేలకు ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

ఈనాడు, కరీంనగర్‌: రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్‌ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్‌రావుకు అవకాశమిచ్చింది. గడిచిన కొన్ని రోజులుగా టికెట్‌ విషయంలో వెలిచాల రాజేందర్‌రావు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నడిచింది. వివిధ సమీకరణల ఆధారంగా ప్రకటన విషయంలో పార్టీ జాప్యం చేస్తూ వచ్చింది. ఈ ఇద్దరు నేతలు మాత్రం తమ అనుచరులతోపాటు పార్టీలోని నాయకులు, కార్యకర్తలకు ఎవరికి వారు అభ్యర్థిగా తమనే ప్రకటిస్తారని చెప్పుకొన్నారు. ఈ క్రమంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం వెంట రాగా అట్టహాసంగా రాజేందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయగా.. ప్రవీణ్‌రెడ్డి తరఫున ఆయన అనుచరులు బుధవారం నామపత్రాలు రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. గురువారం ఆయన సొంతంగా నామినేషన్‌ వేస్తారని వారు ప్రకటించారు. ఇంతలో రాజేందర్‌రావుకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం ప్రకటన జారీ చేసింది. ఖమ్మం స్థానంలో రెడ్డి సామాజికవర్గానికి టికెట్‌ ఇవ్వడం వల్ల ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రవీణ్‌రెడ్డికి నిరాశ

టికెట్‌పై ధీమాగా ఉన్న హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి రిక్తహస్తమే దక్కింది. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో బలమైన నేత అయిన ఆయన గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నించారు. అనూహ్యంగా కరీంనగర్‌కు చెందిన పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌ స్థానానికి వెళ్లి అక్కడి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. టికెట్ల కేటాయింపు సమయంలో పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవీణ్‌రెడ్డికి నచ్చజెప్పారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని మాటిచ్చారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయనతోపాటు ఆయన మద్దతుదారులు ఎంపీ టికెట్‌ వస్తుందనే ఆశలో ఉన్నారు. తీరా అధిష్ఠానం ఆయనకు కాకుండా వేరే నాయకుడి పేరుని ప్రకటించడంతో కంగుతిన్నారు. ప్రవీణ్‌ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో అని పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు తెలిపి నామినేషన్‌ ఉపసంహరించుకుంటారా.. లేదా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటారా అని వారు చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని